Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ ను కేసీఆర్ అన్నారంటే ఇలాంటి వాటికేగా?

By:  Tupaki Desk   |   18 Jan 2019 5:26 AM GMT
కాంగ్రెస్‌ ను కేసీఆర్ అన్నారంటే ఇలాంటి వాటికేగా?
X
ఏదో పీకుతామంటూ తెగ క‌బుర్లు చెప్పేశారు. త‌మ‌కు మించినోళ్లు లేర‌ని.. త‌మ‌దే అధికార‌మ‌ని గొప్ప‌లు చెప్పారు. మాట‌ల్లో క‌నిపించిన హ‌డావుడి చేత‌ల్లో లేక‌పోవటం..క‌మిట్ మెంట్ విష‌యంలోనూ పార్టీ కంటే వ్య‌క్తిగ‌త ప్రాధామ్యాలు ఎక్కువ కావ‌టంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ చ‌తికిల‌ప‌డింది. అప్పుడెప్పుడో ద‌శాబ్దాల నాడు న‌డిచిన రాజ‌కీయాల్ని నేడూ అమ‌లు చేస్తాన‌నే కాంగ్రెస్ తీరును కేసీఆర్ త‌ర‌చూ త‌ప్పు ప‌డుతుంటారు.

తెలంగాణ పాల‌కుల్ని ఢిల్లీ డిసైడ్ చేస్తుందా? రోజులు మారాయి.. ఇప్ప‌టికి సీల్డ్ క‌వ‌ర్ ముఖ్య‌మంత్రులు తెలంగాణ‌ను పాలిస్తారా? అంటూ విరుచుకుప‌డ‌టం తెలిసిందే. అవును క‌దా? కేసీఆర్ చెప్పిందాన్లో న్యాయ‌ముంది.. మ‌నం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఢిల్లీ పెత్త‌నం ఏంద‌న్న భావ‌న తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉన్న వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లు రియాక్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంది.

కేసీఆర్ ఎత్తి చూపించిన లోపాన్ని.. అదే ప‌నిగా త‌మ‌లో ఉంద‌న్న విష‌యం కాంగ్రెస్ నేత‌లుఎప్ప‌టిక‌ప్పుడు చెబుతున్న‌ప్పుడు ఆ పార్టీ ఇమేజ్ మారే అవ‌కాశ‌మే లేదు. ముఖ్య‌మంత్రి సంగ‌తి త‌ర్వాత‌.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎవ‌రు ఉండాల‌న్న విష‌యాన్ని ఢిల్లీ పార్టీ అధినేత తేల్చాలంటూ విన్నవించుకోవ‌టం చూస్తే.. కాంగ్రెస్ తీరు మార‌దా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. అసెంబ్లీ కొలువు తీరిన వేళ‌.. విప‌క్ష నేత‌ను ఎంపిక చేయాల్సి రావ‌టం.. సీఎల్పీ నేత ఎవ‌ర‌న్న అంశంపై ముందే నిర్ణ‌యం తీసుకొని.. అందుకు త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు చేస్తే.. ఈ ఢిల్లీ డ్రామా ఉండ‌దు.

ఏ అంశ‌మైతే త‌మ‌ను త‌ప్పు ప‌ట్ట‌టానికి.. త‌మ‌ను వేలెత్తి చూపించ‌టానికి అవ‌కాశం ఇస్తుందో.. ఆ లోపాన్ని స‌రిద్దిద్దుకోవాల్సింది పోయి.. దాన్నే ప‌ట్టుకొని వేలాడితే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కేసీఆర్ త‌మ‌ను అదే ప‌నిగా ఆడిపోసుకుంటున్నార‌ని వాపోయే కాంగ్రెస్ నేత‌లు.. త‌మ‌లోని లోపాన్ని స‌రిదిద్దుకోవ‌టంపై దృష్టి పెడితే మంచిది. పార్టీని గెలిపించే విష‌యంలో పోటీ ప‌డ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు సీఎల్పీ నేత‌గా త‌మ‌నే ఎంపిక చేయాలంటూ హ‌డావుడి చేయ‌టం క‌నిపిస్తుంది.

సీఎల్పీ నేత‌ను ఎంపిక చేసే బాధ్య‌త పార్టీ అధినేత రాహుల్ కు క‌ట్ట‌బెడుతూ ఏక‌వాక్య తీర్మానాన్ని కాంగ్రెస్ చేసింది. సీఎల్పీ నేత రేస్ లో ఉత్త‌మ్‌.. భ‌ట్టి.. శ్రీ‌ధ‌ర్ బాబు.. మ‌ల్లు ఉన్నారు. ప్ర‌ధానంగా పోటీ ఉత్త‌మ్‌.. భ‌ట్టిల మ‌ధ్యే ఉండ‌ద‌ని.. రాజీ మార్గంలో చూసుకుంటే శ్రీ‌ధ‌ర్ బాబుకు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. ప‌ట్టుమ‌ని పాతిక‌మంది ఎమ్మెల్యేలు కూడా లేని పార్టీకి శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎంపిక చేయ‌టానికి ఇంత సాగ‌దీత అవ‌స‌ర‌మా?