Begin typing your search above and press return to search.

యువ‌రాజు ప‌ట్టాభిషేకానికి రంగం సిద్ధం!

By:  Tupaki Desk   |   4 Dec 2017 5:49 AM GMT
యువ‌రాజు ప‌ట్టాభిషేకానికి రంగం సిద్ధం!
X
ఫ‌లితం ముందే తెలిసినా ప‌రీక్ష రాయాల్సిందేనా? అంటే అవున‌నే చెప్పాలి. ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ యువ‌రాజు ప‌ట్టాభిషేకానికి రంగం సిద్ధ‌మైంది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ ఈ రోజు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ప‌ట్టాభిషేకం ఫిక్స్ అయినా.. సాంకేతికంగా చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో భాగంగానే నామినేష‌న్‌.. ఎన్నిక ప్ర‌క్రియ‌గా చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టే ప‌నిలో భాగంగా ఈరోజు (సోమ‌వారం) నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మం గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తో స‌హా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు రాహుల్ తోపాటు నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షురాలు సోనియాగాంధీ వెంట వెళ్ల‌నున్న రాహుల్‌.. నాలుగు నామినేష‌న్ల సెట్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఇందులో ఒక నామినేష‌న్‌ను సోనియాగాంధీ ప్ర‌తిపాదించ‌నున్నారు. మ‌రో నామినేష‌న్‌ను మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌తిపాదించ‌నున్నారు.

సోనియా.. మ‌న్మోహ‌న్ తో పాటు భారీ ఎత్తున కాంగ్రెస్ నేత‌లు రాహుల్ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఆదివారం సాయంత్రం వ‌ర‌కూ ఎవ‌రూ నామినేష‌న్లు వేయ‌లేదు. అధ్య‌క్ష ప‌ద‌వి బ‌రిలో నిలిచేందుకు అవ‌కాశం ఇస్తూ రాష్ట్రాల‌కు 90 నామినేష‌న్ల సెట్ల‌ను పంపారు. యువ‌రాజే రంగంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రు మాత్రం అధ్యక్ష ప‌ద‌విని చేప‌ట్టేందుకు ముందుకు వ‌స్తారు చెప్పండి.

ఒక‌విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ ఎప్పుడైతే నామినేష‌న్ వేస్తారో అప్పుడే ఆయ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన‌ట్లు. కాకుంటే.. సాంకేతికంగా ఉండే అంశాల‌న్నీ పూర్తి అయి.. ఆయ‌న్ను అధికారికంగా పార్టీ అధినేత‌గా ప్ర‌క‌టించ‌టానికి మరికొంత కాలం ప‌ట్ట‌నుంది.

సాంకేతికంగా చూస్తే.. నామినేష‌న్ల ప‌రిశీల‌న కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుండ‌గా.. అదే రోజు సాయంత్రం 3.30 గంట‌ల‌కు చెల్లుబాట‌య్యే నామినేష‌న్ల వివ‌రాల్ని వెల్ల‌డిస్తారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈ నెల 11 వ‌ర‌కూ గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ.. నామినేష‌న్లు ఎవ‌రూ వేయ‌ని నేప‌థ్యంలో ఉన్న ఒకే ఒక్క అభ్య‌ర్థి రాహుల్ కావ‌టంతో.. యువ‌రాజు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లే లెక్క‌. అట్టే టైం లేని నేప‌థ్యంలో ప‌ట్టాభిషేక సంబ‌రాల‌కు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధ‌మైపోవ‌టం మంచిది.