Begin typing your search above and press return to search.

హస్తవాసి ఫలిస్తుందా...!?

By:  Tupaki Desk   |   22 July 2018 4:50 PM GMT
హస్తవాసి ఫలిస్తుందా...!?
X
కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయా..? కాంగ్రెస్ పార్టీకి అధికారం పొందే యోగం కనపడుతోందా..? ఇందుకోసం పార్టీని పటిష్టపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారా...? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీకి మంచి రోజులు ప్రారంభమయ్యాయని - దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచే ఆరంభ సంకేతం వచ్చిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమయ్యింది. సమీప భవిష్యత్‌ లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కాదు కదా... కనీసం ఆ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి కూడా గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులు భావించారు. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ - అధికార తెలుగుదేశం పార్టీల మధ్య వివాదం పెరగడం... అది అవిశ్వాస తీర్మానం వరకూ వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా లోక్‌ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం పార్టీకి ఎంతో మేలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు అధికారం రాదని ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. అయితే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరువ కావాలన్నది వారి వ్యూహం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని - అదే తమకు ప్రాధాన్యమని ఎపీకి చెందిన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంటే ఇతర రాష్ట్రాల కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ పైనే ఎక్కువ ఆశలున్నాయి. ఆదివారం జరిగిన సిబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీకే పొత్తులు,,, ప్రచార బాధ్యతల వంటి కీలక అంశాలు అప్పగించారు. అంటే పార్టీలో రాహుల్ గాంధీ ప్రభావం ఎక్కువ కావడంతో పాటు ఆయనే పార్టీని ముందుకు నడిపించగలరని భావించడమే. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై తెలుగుదేశం పార్టీ సంధించిన అవిశ్వాస తీర్మానమే హస్తవాసి మారడానికి సంకేతమని ఆంధ్రప్రదేశ్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ పటిష్టతకు దోహదపడతాయన్నది ఆంధ్రప్రదేశ్ నాయకుల నమ్మకం... చూద్దాం... కాంగ్రెస్ గుర్రం ఎగురుతుందేమో... !!!!