Begin typing your search above and press return to search.

రేవంత్ ఎంట్రీతో..రాహుల్‌కు హుషారొచ్చేసిందే!

By:  Tupaki Desk   |   4 Nov 2017 8:27 AM GMT
రేవంత్ ఎంట్రీతో..రాహుల్‌కు హుషారొచ్చేసిందే!
X
టీడీపీకి గుడ్ బై చెప్పిన త‌ర్వాత యువ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్ప‌టిదాకా స్త‌బ్దుగా ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో... రేవంత్ చేరిక‌తో ఒక్క‌సారిగా హుషారొచ్చేసింద‌నే చెప్పాలి. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్‌కు పెద్ద‌గా బావుకున్న‌ది ఏమీ లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఆ పార్టీకి షాకిచ్చి ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గా... ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు కూడా కాంగ్రెస్ పార్టీని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఫ‌లితంగా 60 ఏళ్ల నాటి తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను సాకారం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే త‌గిలింద‌ని చెప్పాలి. వాస్త‌వానికి తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ద‌క్క‌కున్నా... క‌నీసం గౌర‌వ‌ప్ర‌ద‌మైన సంఖ్య‌లో స్థానాలు ద‌క్కాల్సి ఉంది. అయితే ఈ రెండూ నెర‌వేర‌క‌పోగా... ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే... చేతిలో చిప్ప మిగిలింద‌న్న చందంగా కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది.

గ‌తం గ‌తః అన్న‌ట్టుగా గ‌తాన్ని వ‌దిలేస్తే.. మ‌రో ఏడాదిన్న‌ర‌లో జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నున్నాయి. పార్ల‌మెంటుతో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు కూడా ఒకే ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లోనైనా స‌త్తా చూపుదామ‌న్న కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో మిణుకుమిణుకు మంటున్న టీటీడీపీలోని కీల‌క నేత రేవంత్ రెడ్డిపై వ‌ల విసిరింది. అయితే టీఆర్ఎస్‌పై అవిశ్రాంత పోరు సాగిస్తున్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి ఆహ్వానం రాగానే అందుకు సానుకూలంగానే స్పందించారు. వెనువెంట‌నే కోర్టు ప‌నులంటూ ఢిల్లీ ఫ్లైటెక్కిన రేవంత్ నేరుగా రాహుల్ గాంధీ ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆ త‌ర్వాత రేవంత్ పార్టీ మారుతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు, చివ‌ర‌కు ఆయ‌న‌ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవ‌డం జ‌రిగిపోయాయి. రేవంత్ చేరిక‌తో కాంగ్రెస్ పార్టీలో నిజంగానే హుషారు క‌నిపిస్తోంది. కీల‌క నేత‌లంతా ఏదో ఒక సంద‌ర్భంలో రేవంత్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... రేవంత్ చేరిక త‌మ‌కు లాభిస్తుంద‌ని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం విష‌యంపై పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. ఈ నెల 20న రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చేందుకు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ నెల 20న ఆయన వరంగల్‌లో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ లో ఏర్పాటు చేసే సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభకు దళిత, బీసీ, గిరిజన సభగా పేరు ఖరారు చేసినట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సభను తొలుత మహబూబాబాద్ ప్రాంతంలో నిర్వహించాలని భావించినప్పటికీ వరంగలే సరైన వేదిక అని భావించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పడమే ధ్యేయంగా ఈ సభను నిర్వహించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, బీసీ, గిరిజనులను తమవైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోనే సభకు ఆ పేరు ఖరారు చేశారు. రేవంత్ రెడ్డి చేరిక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఇదే కావడం ప్రత్యేకతను సంతరించుకుంది.అలాగే రాహుల్-రేవంత్ ఒకే వేదికపై టీఆర్ఎస్ మీద విరుచుకుపడే సందర్భం రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే... తెలంగాణ‌లో రాహుల్, రేవంత్ యాక్ష‌న్ ప్లాన్ రెడీ అయిపోయింద‌న్న మాట‌.