Begin typing your search above and press return to search.

పారికర్.. అమీర్.. రాహుల్.. ఒక వివాదం

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:33 AM GMT
పారికర్.. అమీర్.. రాహుల్.. ఒక వివాదం
X
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆ మధ్యన ‘భార్య విదేశాలకు వెళదామంది’ అన్నమాటల్ని ​పారికర్ ​ తీవ్రంగా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ పేరును నేరుగా ప్రస్తావించని పారికర్.. ఒక బాలీవుడ్ నటుడి మాటలకు దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని.. ఆయన ఎండార్స్ మెంట్ లో ఉన్న బ్రాండ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. చివరకు సదరు కంపెనీ సైతం వివరణ ఇవ్వాల్సి వచ్చిం​దన్నారు.

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి గుణంపాఠం చెప్పాలనీ.. తన భార్య దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారని చెప్పటం సిగ్గుచేటు వ్యవహారంగా అభివర్ణించి​న పారికర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ​ దాడి చేశారు.
పాకిస్థాన్ లాంటి శత్రుదేశాల నుంచి భారత్ ను రక్షించటం రక్షణమంత్రి పారికర్ బాధ్యతే తప్పించి.. స్వదేశీయులను బెదిరించటం కాదంటూ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. పారికర్ వ్యాఖ్యలు ఆర్ ఎస్ ఎస్ పాఠాలు చెప్పినట్లుగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఒక ట్వీట్ తో మండిపడ్డ రాహుల్.. ‘ద్వేషంతో పిరికివాడు విజయం సాధించలేరని వాళ్లు తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. తన మాటలపై విమర్శలు చెలరేగటంతో పారికర్ స్పందించారు. తాను ‘పాఠం’ నేర్పాలన్న పదం వాడలేదని.. దేశాన్నిప్రేమించే వారు నిశ్శబ్దంగా ఉండకూడదని మాత్రమే తాను చెప్పినట్లుగా వివరణ ఇచ్చారు. పారికర్ లాంటి నిజాయితీ కలిగిన నేతలు తాము మాట్లాడే మాటల్ని ఆచితూచి ఉపయోగించాలే కానీ ఇష్టం వచ్చినట్లు కాదు. తాము చేసే కీలకవ్యాఖ్యలకు రాజకీయ రంగు అంటే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎలాంటి తప్పు దొర్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో చిన్న పొరపాటు దొర్లినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని పారికర్ లాంటోళ్లు మర్చిపోకూడదు.