Begin typing your search above and press return to search.

యువరాజు కునుకేమో కానీ రచ్చరచ్చగా మారిందే

By:  Tupaki Desk   |   20 July 2016 4:32 PM GMT
యువరాజు కునుకేమో కానీ రచ్చరచ్చగా మారిందే
X
బయట వాతావరణం వేడిగా ఉన్న వేళ.. ఏసీలతో చల్లగా ఉండే హాల్లోకి వచ్చి కూర్చున్న వెంటనే నిద్రపోతారా? ఈ ప్రశ్న వేసినోళ్ల మీద కాస్త చిత్రంగా చూసేఅవకాశం ఉంది. కానీ.. ఘనత వహించిన కాంగ్రెస్ నేతలు.. తమ యువరాజు తాజాగా తీసిన కునుకు ఎపిసోడ్ ను కవర్ చేసేందుకు చేసిన ప్రయత్నం కవర్ కావటం తర్వాత.. కామెడీగా మారిన దుస్థితి.

ఓపక్క పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ.. మరోవైపు రాహుల్ తన చేతిని నుదిటి మీద పెట్టుకొని కునుకు తీయటం స్పష్టంగా కనిపించిన పరిస్థితి. దీంతో.. రాహుల్ తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయ ఏమిటంటే.. గుజరాత్ లో దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ పార్లమెంటులో హాట్ టాపిక్ మీద రచ్చ జరుగుతున్న వేళ.. రాహుల్ సీరియస్ గా కునుకు తీయటంతో మీడియాకు మంచి మేత దొరికినట్లైంది.

దీంతో.. ఎవరికి వారు వారికి నచ్చినట్లుగా వార్తలు ప్రసారం చేయటంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిన పరిస్థితి. మరోవైపు.. దళితుల మీద దాడి జరుగుతున్నఉదంతాల్ని స్వయంగా పరిశీలించేందుకు గుజరాత్ లో రాహుల్ త్వరలో పర్యటించాలని డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో.. ఆయన కునుకు తీయటంతో దళితుల పట్ల రాహుల్ కు ఉన్న సీరియస్ నెస్ ఏమిటన్నది తేలిపోయిందంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే యువరాజు నిద్ర సీన్ ను వీలైనంతగా కవర్ చేసుకోవటానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించటం.. ఎవరికి వారు వారికి తోచిన వెర్షన్ చెప్పటం మరింత రచ్చకు దారి తీయటమే కాదు.. అదో కామెడీగా మారిపోయింది.

కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ‘‘బయట వేడిగా ఉంది.పార్లమెంటులో లోపల చల్లగా ఉంది. అందుకే బయట నుంచి వచ్చిన ఎవరైనా కొంచెం రిలాక్స్ అవుతారు’’ అంటూ చెప్పటం.. రాహుల్ కునుకు తీసినవిషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా మారింది. ఇక.. ఆయన నిద్రపోవటం లేదని..తన ఫోన్లో ఇన్ బాక్స్ చెక్ చేసుకుంటున్నట్లుగా మరికొందరు నేతలు కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. నుదిటికి చేయి ఆనించి.. కొంచెం కిందకు వంగి..కళ్లు మూసుకున్నట్లుగా కెమేరాలో స్పష్టంగా రికార్డ్ అయిన నేపథ్యలో కాంగ్రెస్ నేతల కవరింగ్ కామెడీగా మారింది. ఇంతకీ.. పట్టపగలు రాహుల్ కు అంతనిద్రేంటో..?