Begin typing your search above and press return to search.

జైలుకు వెళ్లి జోష్‌ను పీక్స్ కు తీసుకువెళ్లిన రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   7 May 2022 2:38 PM GMT
జైలుకు వెళ్లి జోష్‌ను పీక్స్ కు తీసుకువెళ్లిన రాహుల్ గాంధీ
X
రైతు సంఘర్షణ సభ పేరుతో వరంగల్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ... త‌న రెండు రోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో పార్టీ నేత‌ల్లో మ‌రింత ఉత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేశారు. పార్టీ కార్యాల‌య‌మైన గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశం నిర్వ‌హించి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను నిర్దేశించారు. దీనికి తోడుగా చంచ‌ల్‌గూడా జైలులో విద్యార్థి నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్ కనిపిస్తోంది.

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఓయూలో విద్యార్థుల‌తో స‌మావేశం అయ్యేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ ఓయూ వీసీ ఛాంబర్‌ ముందు NSUI నేతలు నిర‌స‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే.

నిరసన తెలిపిన వారిలో 18 మంది నేతలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. ఒకింత ఉత్కంఠ త‌ర్వాత ద‌క్కిన అనుమ‌తితో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ నేత‌ల‌తో ములాఖత్ అయ్యారు.

దాదాపు 25 నిమిషాలు వీరితో చర్చించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థి నేత‌లు ప్ర‌స్తావించిన ప‌లు అంశాల‌ను రాహుల్ గాంధీ విన్నారు. వారికి పార్టీ త‌ర‌ఫున అండ‌గా ఉంటార‌ని హామీ ఇచ్చారు.

కాగా, చంచల్‌గూడ జైలుకు వెళ్లి అరెస్టైన విద్యార్థి నేత‌ల‌ను పరామర్శించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం రాహుల్ గాంధీ చేశార‌ని అంటున్నారు.

రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన ముఖ్య నేత‌, గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయడం, బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించి పోవ‌డం కాకుండా, జైలుకు వెళ్లి పార్టీ కోసం చెర‌సాల పాలైన నేత‌ల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా... ప్ర‌జ‌ల ప‌క్షాన‌, పార్టీ త‌ర‌ఫున గ‌లం వినిపించే వారికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌నే సంకేతాలు ఇచ్చార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున‌నారు. అంతేకాకుండా కీల‌క‌మైన విద్యార్థి విభాగం బ‌లోపేతం కోసం కూడా ఈ నిర్ణ‌యం మేలు చేస్తుంద‌ని పేర్కొంటున్నారు.