Begin typing your search above and press return to search.

వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ ప్రసంగంలో ఫైరింగ్ వ్యాఖ్యలివే

By:  Tupaki Desk   |   7 May 2022 3:29 AM GMT
వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ ప్రసంగంలో ఫైరింగ్ వ్యాఖ్యలివే
X
చూసేందుకు చాక్లెట్ బాయ్ మాదిరి.. అమూల్ బేబీ మాదిరి ఉంటారనే పొలిటికల్ సర్కిల్స్ విమర్శల నుంచి రాహుల్ ను చూసేవారికి కొదవ లేదు. అందుకు భిన్నంగా రాహుల్ ను రాహుల్ గా చూస్తూ..ఆయన వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తూ చూస్తే.. గడిచిన కొన్నేళ్లలో ఆయన మాటల్లో స్పష్టత ధ్వనించటమే కాదు.. తాను మాట్లాడే మాటలకు సంబంధించిన పూర్తి అవగాహన ఉందన్న విషయం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి బోలెడంతమంది నేతలు వస్తుంటారు.. వెళుతుంటారు. కానీ.. వారందరికి భిన్నంగా రాహుల్ గాంధీ వ్యవహరించారని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయంపై రాహుల్ నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నప్పుడు.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఎంత లోతుగా చూస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎప్పటికి క్షమించమని చెప్పటమే కాదు.. ఆ పార్టీతో ఎప్పటికి ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు.. పొత్తు గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఏస్థాయి వారినైనా సరే.. పార్టీ నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఇటీవల కాలంలో కేసీఆర్ ను ఉద్దేశించి ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసిన జాతీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే అవుతారని చెప్పాలి. కేసీఆర్ తో తాను యుద్ధం చేస్తానని.. ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు కాదని.. ఇది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కు.. తనకు కేసీఆర్ కు లడాయిగా రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. కేసీఆర్ మీద కాంగ్రెస్ అధినాయకత్వం ఎంత గుర్రుగా ఉందన్న విషయాన్ని రాహుల్ మాటలు స్పష్టం చేశాయని చెప్పాలి.

రాహుల్ ప్రసంగంలో ఫైరింగ్ చేసే వ్యాఖ్యలతో పాటు.. తెలంగాణ ప్రజల్ని ఇట్టే ఆకట్టుకునే వ్యాఖ్యలు ఉన్నాయి. అవేమంటే..

- తెలంగాణకు ధోకా చేసిందెవరు? తెలంగాణ కలలకు ద్రోహం చేసిందెవరు? ఆ వ్యక్తి పేరేమిటి? అని పదే పదే ప్రశ్నించారు. రాహుల్ ప్రశ్నలకు స్పందించిన వేలాది మంది పెద్ద ఎత్తున.. 'కేసీఆర్' అని చెప్పారు.
- తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తితో కాంగ్రెస్ కు ఎలాంటి పొత్తు ఉండదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. ఏ కాంగ్రెస్ నాయకుడైనా సరే టీఆర్ఎస్ తో పొత్తు గురించి మాట్లాడితే.. ఆ నేత ఎంత పెద్దవాడైనా సరే పార్టీ నుంచి బయటకు వెళ్లగొడతాం. టీఆర్ఎస్ తో పొత్తు అనే ఆలోచన ఉండే ఎంత పెద్ద నేత అయినా సరే పార్టీ నుంచి బయటకు పంపిస్తాం.
- టీఆర్ఎస్ తో కానీ బీజేపీతో కానీ బంధాలు పెంచుకోవాలనుకునే నేతలు తక్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ప్రత్యక్ష పోరు ఉంటుంది. ఎవరైతే తెలంగాణ కలను నష్టపరిచారో.. తెలంగాణ రైతులు.. యువత నుంచి లక్షల కోట్లు చోరీ చేశారో.. ఆ వ్యక్తిని ఎన్నటికీ క్షమించం.
- తెలంగాణ రాష్ట్రం అంత సులువుగా ఏర్పడ లేదు. తమ కల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం తెలంగాణ యువత, తల్లులు తమ కన్నీళ్లు, రక్తాన్ని ధార పోశారు. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఈ రాష్ట్రం ఏర్పడలేదు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రగతి పథంలో పయనించాలన్న కల నెరవేరిందా? అని ప్రజలను ప్రశ్నించారు. రాహుల్ ప్రశ్నకు సమాధానంగా సభికులు పెద్ద ఎత్తున లేదు.. లేదు అని సమాధానం ఇచ్చారు.
- సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వెనుక ఒక స్వప్నం ఉంది. ఇక్కడి ప్రజల కల నెరవేరుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చారు. ఆ కల సోనియాది, మీది, నాది కూడా. దాన్ని సాకారం చేస్తాను. ఇది తెలంగాణ రైతులు, యువకుల పోరాటం మాత్రమే కాదు. కాంగ్రెస్‌ పార్టీది. నాది కూడా.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేవలం ఒక కుటుంబానికి మేలు జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మీకేమైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయా? వారి కన్నీటికి బాధ్యులు ఎవరు? (సభకు వచ్చిన ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలను చూపిస్తూ)
- రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు పోరాడినపుడు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచింది. వారితో పాటు పోరాడింది. చివరికి కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ ప్రజలకు రాష్ట్రాన్ని ఇచ్చారు. రాష్ట్రం ఇవ్వడంతో కాంగ్రె్‌సకు తీరని నష్టం జరిగింది. నష్టం జరుగుతుందని తెలిసీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొత్త రాష్ట్రాన్ని ఇచ్చాం.
- ఎక్కడైతే నా అవసరం ఉంటుందో, ఎక్కడికైతే నన్ను పిలుస్తారో, ఎక్కడైతే నా మద్దతు అవసరమో.. అందుకోసం నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.
- కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక స్నేహ పూర్వకంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రజలంతా ఆశించారు. అందుకు విరుద్ధంగా నిరంకుశ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రే కాదు. నిరంకుశ రాజు. ముఖ్యమంత్రి ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజలు కోరుకున్నట్లు పాలనా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. రాజు తాను ఏం చేయాలో అది చేస్తారు. ప్రజలు కోరుకునేది పట్టించుకోరు.
- టీఆర్‌ఎ్‌సతో సంబంధం కావాలనుకునే వాళ్లు ఆ పార్టీలోకో బీజేపీలోకో వెళ్లండి. ఎందుకంటే టీఆర్‌ఎస్‌, బీజేపీ మఽధ్యే సంబంధం ఉంది. అప్పట్లో నరేంద్ర మోదీ రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తెచ్చినపుడు టీఆర్‌ఎస్‌ ఏం స్టాండ్‌ తీసుకుందో మీకు గుర్తు రావాలి.
- తెలంగాణను బీజేపీ ఎన్నటికీ ప్రత్యక్షంగా పాలించలేదు. అది బీజేపీకీ తెలుసు. అందుకే రిమోట్‌ కంట్రోల్‌తో పాలించాలని అనుకుంటోంది. కాంగ్రె్‌సతో కుదరదు. అందుకే ఇక్కడ టీఆర్‌ఎస్‌ సర్కారు ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అందుకే, కేసీఆర్‌ ఎంత దోపిడీ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఈడీతో కానీ, సీబీఐతో కానీ దర్యాప్తు చేయించదు.
- రైతుల కోసం నిర్వహించిన సభలో వారికి భరోసా ఇవ్వడానికి రైతు అంశాలపై డిక్లరేషన్‌ పెట్టాం. తర్వాత పెట్టబోయే సభ ఆదివాసీల కోసం. వారు కోరుకున్నట్లు పదిశాతం రిజర్వేషన్లను కల్పించే విషయమై పూర్తి మద్దతు ఇస్తాం.
- తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎ్‌సకు రెండు సార్లు అవకాశమిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఈసారి కాంగ్రె్‌సకు ఒక అవకాశం ఇవ్వండి. రైతు, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తాం.
- ఎన్నికల సమయంలో టికెట్ల సమస్య తలెత్తుతుంది. నేతలంతా గుర్తు పెట్టుకోండి. ఎవరైతే ప్రజల కోసం పోరాడుతారో.. వారికి ప్రతిభ ఆధారంగా టికెట్‌ లభిస్తుంది. ఎంత పెద్దవారైనా రైతులు, పేదల తరఫున నిలబడి పోరాటాలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ లభించదు.