Begin typing your search above and press return to search.

జగన్ అడ్డాలో రాహుల్ ... ?

By:  Tupaki Desk   |   12 Dec 2021 4:30 AM GMT
జగన్ అడ్డాలో రాహుల్ ... ?
X
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చూపు ఏపీ మీద పడుతోంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాల్సిన నేపధ్యంలో ఏపీలో కాస్తా అయినా లేపాలని రాహుల్ డిసైడ్ అయ్యారని టాక్. ఏపీలో జగన్ రెండున్నరేళ్ల పాలన తరువాత ఎంతో కొంత స్కోప్ కాంగ్రెస్ కి ఉంటుందన్న నివేదికలు ఏఐసీసీకి వెళ్ళాయట. వైసీపీ బలం బలగం అంతా కాంగ్రెస్ నుంచే అన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ కి ఏపీలో బలమైన రెడ్డి సామాజికవర్గం సపోర్టు ఎపుడూ ఉంటూ వచ్చింది. విభజన తరువాత ఆ వర్గం జగన్ వైపు పూర్తిగా చేరిపోవడంతో పాటు కాంగ్రెస్ చేసిన అతి పెద్ద పొరపాటు కారణంగా ఏపీలో సోదిలో లేకుండా పోయింది. దానికి పరిహారంగా రెండు ఎన్నికలలో శిక్షను అనుభవించామని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇపుడు తమ కంటే పెద్ద తప్పులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఏపీలో మళ్లీ ఊపిరి పీల్చుకునేందుకు వీలుంటుందని లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్.

ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి వంటి హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. విభజన చట్టంలో అనేక రాయితీలను కూడా నాటి యూపీయే సర్కార్ ప్రకటించింది. అయితే ఇపుడు అవన్నీ కేంద్రంలోని బీజేపీ అమలు చేయడంలేదు, వైసీపీ కూడా నిలదీయడంలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు పూర్తి చేస్తామని కాంగ్రెస్ గట్టిగా చెప్పబోతోంది.

అలాగే ఏపీలో వైసీపీ ఏలుబడిలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్ర పరిస్థితిని కూడా జనంలోకి తీసుకెళ్ళి జగన్ కి ఎదురు నిలవబోతోందిట. ఇక వైసీపీకి ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ ని బద్ధలు కొట్టడానికి ఆయన బీజేపీకి రహస్య మిత్రుడు అన్న ప్రచారం కూడా చేయబోతోందిట. వైసీపీలో రెడ్డి వర్గం అసంతృప్తికి లోనవుతోంది. సామాజిక న్యాయం పేరిట వారిని పక్కన పెడుతున్నారు. వారు తెగించి టీడీపీలోకి పోలేరు. అలాగని ఉన్న చోట ఉండలేరు.

అలాంటి వారిని చేరదీస్తే కాంగ్రెస్ కి పూర్వ బలం వస్తుంది అన్న ఆలోచనలు ఉన్నాయట. ఇక ఏపీలో పీసీసీ చీఫ్ ని కూడా మారుస్తారు అంటున్నారు. రెడ్డి లేదా కాపు సామాజిక వర్గానికి ఆ పదవిని ఇవ్వడం ద్వారా కీలక ప్రాంతాల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కొత్త ఏడాది మొదట్లోనే రాహుల్ గాంధీ ఏపీలో టూర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన రాయలసేమ ప్రాంతంలో బహిరంగ సభను పెడతారు అంటున్నారు.

అంటే ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడే తొలి పాదం మోపడానికి రాహుల్ ప్రిప్రేర్ అయి మరీ వస్తున్నార‌ని చెబుతున్నారు. మరి ఏపీలో రాహుల్ కాంగ్రెస్ ని బలోపేతం చేయడంతో పాటు భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తునకు కూడా సిద్ధపడతారు అంటున్నారు. మొత్తంగా చూస్తే 2022 రావడంతోనే ఏపీలో రాజకీయ సమీకరణలు మొత్తం మారే అవకాశాలు ఉన్నాయి. ఏపీ అన్ని విధాలుగా శాపగ్రస్థగా మారిన వేళ, విభజన హామీలకు లెక్కా జమా లేని చోట, కేంద్రం రిక్త హస్తం, రాష్ట్రం ఉదాశీనత అన్నీ కలసి ఏపీ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తున్న వేళ కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా నేనున్నాను అంటూ ఎంట్రీ ఇస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే ఇపుడు ఆసక్తికరమైన చర్చ.