Begin typing your search above and press return to search.

రాహుల్ రాక‌.. వాళ్ల‌ కాక‌.. టీ కాంగ్రెసులో ఏం జ‌రుగుతోంది..!

By:  Tupaki Desk   |   7 May 2022 7:29 AM GMT
రాహుల్ రాక‌.. వాళ్ల‌ కాక‌.. టీ కాంగ్రెసులో ఏం జ‌రుగుతోంది..!
X
పార్టీల అధినేత‌ల ప‌ర్య‌ట‌న‌లు అంద‌రిలో ఉత్సాహం నింపుతాయి. ఢిల్లీ స్థాయి నేత‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన‌పుడు నేత‌ల్లో, కార్య‌క‌ర్త‌ల్లో ఉండే జోషే వేరు. ఇత‌ర పార్టీల నేత‌ల చేరిక‌తో వేదిక క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. కానీ, తెలంగాణ కాంగ్రెసులో మాత్రం అలాంటిది మ‌చ్చుకైనా క‌నిపించ‌క‌పోగా.. కొత్త ఇబ్బందులు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌నకు ముందు జ‌రుగుతున్న‌ సంఘ‌ట‌న‌లు అంద‌రినీ టెన్ష‌న్ కు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా టీ కాంగ్రెసుకు చికాకులు తెచ్చి పెట్టిన రెండు సంఘ‌ట‌న‌ల్లో మొద‌టిది మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం. 2014లో చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున పార్ల‌మెంటుకు ఎన్నికైన ఆయ‌న త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ పార్టీ విధానాలు న‌చ్చ‌క‌ దూరం జ‌రిగారు. కాంగ్రెసులో చేరి 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి చేతిలో స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

ఆ త‌ర్వాత రాష్ట్ర కాంగ్రెస్ రాజ‌కీయ వ్య‌వ‌హారాలు న‌చ్చ‌క దూరం జ‌రిగారు. రేవంత్ రెడ్డికి స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డిన‌ కొండా రేవంత్ పీసీసీ చీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాక తిరిగి పార్టీలోకి వ‌స్తార‌ని భావించారు. అయితే ఆయ‌న పార్టీలో చేర‌లేదు కానీ.. రేవంత్ చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో అంద‌రూ కొండా కాంగ్రెసులోనే ఉంటార‌ని భావించారు.

అయితే కొండా మాత్రం రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తున్నారు. ఒక‌సారి బీజేపీలో చేర‌తాన‌ని.. మ‌రోసారి కాంగ్రెసులోనే ఉంటాన‌ని త‌న స‌న్నిహితుల‌తో చెప్పుకొచ్చారు. అయితే.. రెండు రోజుల క్రితం బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో కొండా పాల్గొని అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఆయ‌న‌ బీజేపీలో చేరేందుకే సిద్ధ‌మ‌య్యార‌ట‌. దీంతో రేవంతుకు ఈ ప‌రిణామం మింగుడుప‌డ‌డం లేదు. రాహుల్ స‌భ‌కు ముందు ఇది జ‌ర‌గ‌డం పెద్ద మైన‌స్ గా చెప్పుకుంటున్నారు.

ఇదీ కాకుండా పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి కొత్త స‌మ‌స్య‌లు సృష్టించారు. రాహుల్ స‌భ‌కు హాజ‌రుకాకుండా.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ శ్రేణుల్ని స‌న్న‌ద్ధం చేయ‌కుండా మిన్న‌కుండిపోయారు. దీంతో ఆయ‌న పార్టీకి దూర‌మ‌యిన‌ట్లేన‌ని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయ‌న అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి ఇది పెద్ద ఎదురుదెబ్బ‌గానే భావించాలి. ఉమ్మ‌డిగా రాహుల్ ముందు బ‌లం చూపాల్సింది పోయి కీల‌క స‌మ‌యంలో త‌మ్ముడు మొండిచేయి చూప‌డంతో ఆయ‌న అసంతృప్తిగా ఉన్నార‌ట‌. మ‌రి రాహుల్ స‌భ‌లో ఈ లోపాల‌ను ఎలా క‌వ‌ర్ చేస్తారో వేచి చూడాలి.