Begin typing your search above and press return to search.

రాహుల్ కు మోడీ చేసిన ప్రపోజల్ ఇదేనట

By:  Tupaki Desk   |   16 Dec 2016 7:44 AM GMT
రాహుల్ కు మోడీ చేసిన ప్రపోజల్ ఇదేనట
X
‘‘నా దగ్గర ఉన్న పక్కా సమాచారాన్ని ఎక్కడ బయటపెడతానోనని ప్రధాని మోడీ భయపడుతున్నారు. మోడీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని సభలో ప్రకటించాలని అనుకుంటున్నా. అందుకే సభ జరగకుండా అధికారపక్షం అడ్డుకుంటోంది’’ అంటూ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనానికి గురి కావటమే కాదు.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో ప్రధాని మోడీకి సంబంధించి.. ఆయన అవినీతికి సంబందించి మాట్లాడని రాహుల్ గాంధీ.. అందుకు భిన్నంగా తీవ్ర ఆరోపణలు చేయటం ఆసక్తికరంగా మారింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండు రోజుల్లో ముగుస్తాయన్న సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మాటలు కొత్త తరహా చర్చకు తెర తీశాయి. ఇవి ఇలా సాగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం.. పార్లమెంటులోని తన కార్యాలయంలో ప్రధాని మోడీతో.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అండ్ కో కలవటం.. ఆయనతో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోడీపై తీవ్ర ఆరోపణలు చేసిన కొన్ని గంటల అనంతరం.. ఎవరూఊహించని రీతిలో ఆయనతో తన పరివారాన్ని వెంట వేసుకెళ్లిన రాహుల్.. మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకున్న మోడీ.. కాంగ్రెస్ నేతల డిమాండ్ల మీద పెదవి విప్పలేదని చెబుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని.. వారి రుణాల్ని మాఫీ చేయాలన్న డిమాండ్లను మోడీ ముందుకు తీసుకురాగా.. ఆయన ఏమీ స్పందించలేదని చెబుతున్నారు.

అయితే.. సమావేశం ముగిసిన సమయంలో మాత్రం.. ఇదే తరహాలో తరచూ కలవాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తో మోడీ చెప్పిన మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనమిద్దరం తరచూ కలుస్తూ ఉందామని స్వయంగా మోడీనే రాహుల్ తో అనటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. భూమి బద్ధలైపోయే మోడీ గుట్టు తన దగ్గర ఉందంటూ ఘీంకరించిన రాహుల్ ను మోడీ తరచూ కలుద్దామని ప్రపోజల్ తేవటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు. మోడీ ప్రపోజల్ పై రాహుల్ ఎలా రియాక్ట్ అవుతారో కాలమే సమాధానం ఇవ్వాలి.