Begin typing your search above and press return to search.

కారు చార్జర్ వైరుతో వ్యాపారవేత్త రాహుల్ ను చంపేశారు

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:29 AM GMT
కారు చార్జర్ వైరుతో వ్యాపారవేత్త రాహుల్ ను చంపేశారు
X
సంచలనంగా మారిన విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసు లెక్కను తేల్చారు పోలీసులు. కారులోనే హత్య చేసిన అతడ్ని.. కారులో ఉండే ఫోన్ ఛార్జర్ వైరుతోనే చంపేసిన వైనాన్ని గుర్తించారు. కారు వెనుక సీట్లో కూర్చొని రాహుల్ ను హత్య చేసినట్లుగా తేల్చారు. ఇంతకీ రాహుల్ హత్య ఎందుకు జరిగింది? దానికి దారి తీసిన కారణాలు ఏమిటి? అన్న వివరాల్ని తాజాగా పోలీసులు వెల్లడించారు.

1991 నుంచి కోరాడ విజయకుమార్ చిట్ వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ బిజినెస్ లో గాయత్రి అనే మహిళ కూడా వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కోరాడా విజయకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా భారీగా పెట్టిన ఖర్చుతో ఆర్థికంగా కుదేల్ అయ్యారు. దీంతో అప్పుల బాధ ఎక్కువ కావటంతో చిరగ్గా ఉండేవాడు. విజయ కుమార్ కు వ్యాపార వేత్త రాహుల్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తనకు అప్పుల బాధ ఎక్కువైందని.. తన వాటా ఉన్న ఫ్యాక్టరీని అమ్మేయటం కానీ.. వేరే వారికి తన వాటా ఇచ్చేసి.. ఆ డబ్బుల్ని తనకు ఇవ్వాలని రాహుల్ ను కోరేవాడు. అయినా.. రాహుల్ మాత్రం మాట దాటేస్తూ వస్తున్నాడు. దీంతో.. అతడిపైన ఒత్తిడి ఎక్కువైంది. దీంతో రాహుల్ ఇష్యూ సెటిల్ చేయాలని కోరుతూ కోగంటి సత్యం వద్దకు విజయ్ కుమార్ వెళ్లాడు. తన గోడును వెళ్లబోసుకున్నాడు. సదరు ఫ్యాక్టరీకి చెందిన షేర్లను కొనుగోలు చేసేందుకు కోగంటి సత్యం ఓకే చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్ కు చెప్పి.. ఇష్యూ సెటిల్ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా.. రాహుల్ మాత్రం పట్టించుకోలేదు.

ఇలాంటి సమయంలోనే విజయ్ కుమార్ వ్యాపార భాగస్వామి అయిన గాయత్రి కుమార్తెకు ఢిల్లీలో మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తానని చెప్పి రాహుల్ ఆమె వద్ద నుంచి రూ.6 కోట్లు తీసుకున్నాడు. డబ్బులు తీసుకోవటమే కానీ పీజీ సీటు ఇప్పించలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బుల గురించి అడిగితే.. మాట దాటేసేవాడు. దీంతో రాహుల్ పై ఆమె కూడా తీవ్రమైన అసహనంతో ఉన్నారు.

ఈ క్రమంలో రూ.50 లక్షలు ఇస్తానని గాయత్రికి చెప్పిన రాహుల్ తన కారులో బయలుదేరాడు. కోరాడ విజయకుమార్ కు చెందిన మనుషులు రాహుల్ ను కొట్టారు. ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా రాహుల్ ను వేరే కారులో తీసుకెళ్లి.. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్న కోగంటి సత్యం.. విజయ్ కుమార్ లు అనంతరం రాహుల్ ను పంపేశారు. విజయకుమార్.. మరో ముగ్గురు కలిసి రాహుల్ ను కారు వద్దకు తీసుకెళ్లారు. అతడు కారు ముందు సీట్లో కూర్చున్న తర్వాత చార్జర్ వైరుతో వెనుక నుంచి మెడకు బిగించి హత్య చేశారు. ఈ ఉదంతంలో విజయ్ కుమార్ తో పాటు.. మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు.

కోగంటి సత్యం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇప్పటివరకు ఈ హత్యకు సంబంధించి మొత్తం 13 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు. హత్యకు జరిగిన కారణాల్ని వెల్లడించిన పోలీసులు.. మర్డర్ మిస్టరీని తేల్చారు.