Begin typing your search above and press return to search.

రాహుల్‌ హత్య కేసు : ప్రధాన నిందితుడు కోగంటి సత్యం అరెస్టు

By:  Tupaki Desk   |   24 Aug 2021 4:35 AM GMT
రాహుల్‌ హత్య కేసు : ప్రధాన నిందితుడు కోగంటి సత్యం అరెస్టు
X
ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, జడ్‌ ఎక్స్‌ ఇన్‌ సిలిండర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణం రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ ఐఆర్‌ లో ఐదుగురి పేర్లను చేర్చారు. ఈ కేసులో కోగంటి సత్యంను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్న పోలీసులు సత్యంను బెంగళూరులో అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్‌, ఆయన భార్య పద్మజ, విజయ్‌ కుమార్‌ సన్నిహితురాలు గాయత్రి, ఆమె కుమార్తె పద్మజ ఉన్నారు.

ప్రస్తుతం కోగంటి సత్యంను బెంగళూరు నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు పోలీసులు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా, ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రాహుల్‌ హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రశ్నిస్తున్నారు.

హత్యకు 3 రోజుల ముందుగానే కోరాడ, కోగంటి సత్యం కాల్‌డేటా సేకరించారు పోలీసులు. రాహుల్‌పై కోరాడను ఉసిగొల్పిన కోగంటి సత్యం.. హత్య కోసం పక్కా ప్లాన్‌ వేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య ఎలా చేయాలి.. ఎక్కడికి పారిపోవాలి.. ఎలా లొంగిపోవాలో.. అనే అంశాలపై కోగంటి సత్యం ముందస్తుగానే స్కెచ్‌ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనుమానం రాకుండా హత్య జరిగిన రోజు కోగంటి సత్యం విజయవాడలోనే ఉన్నాడు. అయితే రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. రాహుల్ ది హైప్రొఫైల్ మర్డర్ గా తెలుస్తోంది.

అయితే విజయ్‌కుమార్‌ మాత్రం.. కంపెనీలో తానే మేజర్‌ పెట్టుబడి పెట్టానని.. అలాంటప్పుడు తనకు తెలియకుండానే రాహుల్‌ అనేక మందిని చేర్చుకున్నాడని చెప్పినట్టుగా తెలిసింది. హత్యలో కోగంటి సత్యం పాత్ర ఏంటి, తన మనుషులు ఎవరైనా హత్యలో ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 18న విజయవాడలో తన కారులోనే రాహుల్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రాహుల్‌ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. హత్య సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ముగ్గురిలో ఓ మహిళ మృతుడు రాహుల్‌ కు గతంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు, ఏ పని కోసం ఇచ్చారనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌ కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది.

కంపెనీలో వాటా విషయంలో కోగంటి సత్యం ప్రవేశించడంతో అంతా మారిపోయినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి రాహుల్‌ హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో రాహుల్ హత్య కేసులో నిందితుడైన కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కోగంటి సత్యం ఏం చెబుతారనేది ఉత్కంఠగా మారింది.