Begin typing your search above and press return to search.

రాహుల్‌ పాదయాత్ర.. సోనియా పంపిన దాన్ని వినియోగించే నా?

By:  Tupaki Desk   |   19 Oct 2022 6:37 AM GMT
రాహుల్‌ పాదయాత్ర.. సోనియా పంపిన దాన్ని వినియోగించే నా?
X
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీల నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు. అయితే అందరికంటే ముందు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర పాదయాత్ర కొనసాగుతోంది.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు మొత్తం 3,570 కిలోమీటర్లు రాహుల్‌ పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన 1,000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో రాహుల్‌ పాదయాత్ర పూర్తయింది. ఆయన రోజుకు 20 కిలోమీటర్లు చొప్పున నడుస్తున్నారు.

ప్రస్తుతం 41వ రోజు రాహుల్‌ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. 41వ రోజు రాహుల్‌ 22 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్రలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ జేడీ శీలం, సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా ఎక్కువ దూరం నడవడం వల్ల మొదట్లో బొబ్బలు వంటి కొన్ని ఇబ్బందులు వస్తాయని, అయితే తనకు అవేమీ లేవని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఎండ వేడిమి నుండి రక్షించుకోవడానికి ఏ సన్‌స్క్రీన్‌ ఉపయోగిస్తున్నారని మీడియా అడిగినప్పుడు దేన్నీ వినియోగించడం లేదని తెలిపారు. చివరకు తన తల్లి సోనియాగాంధీ కూడా సన్‌స్క్రీన్‌ లోషన్‌ పంపారని.. అయితే దానిని కూడా ఉపయోగించలేదని చెప్పారు.

తన ఆరోగ్యంపైనే కాకుండా తనతోపాటు యాత్రలో నడుస్తున్న సహ యాత్రికులపైన కూడా రాహుల్‌ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో తనతోపాటు నడుస్తున్నవారు ఆరోగ్యం ఉన్నారా లేదా? అని రాహుల్‌ ఆరా తీస్తున్నారు. అలాగే తనతోపాటు యాత్రలో నడుస్తున్నారా అని ఆయన అడుగుతున్నారు. అందుకు సహ యాత్రికులంతా అవునంటూ బదులిస్తున్నారు.

పార్టీ సోషల్‌ మీడియా టీమ్‌ పోస్ట్‌ ఒక వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో కొంతమంది పార్టీ కార్యకర్తలు కాళ్లకు కట్టు కట్టినట్లు కూడా కనిపించింది. రాహుల్‌తో నడుస్తున్న నాయకులు ఎక్కువ గంటలు నడవడం మరియు వ్యాయామం చేయడం చాలా అరుదు. అయినప్పటికీ వీరంతా అంత ఉత్సాహంగా ఎలా యాత్ర చేస్తున్నారని అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే పోషకాహార నిపుణులు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌ వారికి శిక్షణ ఇస్తున్నారు. ఎలా నడవాలో.. అలసట దరి చేరకుండా నడవడం ఎలాగో శిక్షణ ఇస్తున్నారు. వీటితోపాటు ఆ నాయకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాయకుల ఉత్సాహం సామాన్య కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెంచుతోంది.

కాగా రాహుల్‌ గాంధీ అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి తన ఓటు వేశారు. ఈ పదవికి మాజీ కేంద్ర మంత్రులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.