Begin typing your search above and press return to search.

ఏపీలో యువరాజు ప్లాన్ వర్కువుట్ కాదంతే

By:  Tupaki Desk   |   15 Aug 2021 5:30 AM GMT
ఏపీలో యువరాజు ప్లాన్ వర్కువుట్ కాదంతే
X
చేయకూడని తప్పు చేసిన తర్వాత.. ఎంత దిద్దుకుందామన్నా పూర్వపు పరిస్థితి అయితే ఎప్పటికి రాదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉండేదో తెలిసిందే. వైఎస్ నాయకత్వంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి.. వరుసగా రెండుసార్లు విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. తన హయాంలో రాష్ట్ర విభజనకు ఓకే చెప్పటం తెలిసిందే. దీంతో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కకావికలమైంది. పేరున్న నేతలు ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

ఏపీ కాంగ్రెస్ విషయానికి వస్తే.. అయితే రఘువీరారెడ్డి లేదంటే శైలజానాథ్ లు తప్పించి పేరున్న నేతలు ఇప్పుడా పార్టీలో లేరు. ఒకప్పుడు ఆ పార్టీలో పదవుల కోసం ఏపీ నుంచి విపరీతమైన పోటీ ఉండేది. పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగేది. అలాంటిది ఇప్పుడు భూతద్దం వేసుకొని వెతుకుదామనుకున్నా.. కాంగ్రెస్ వైపు చూసేందుకు నేతలు ఎవరూ ఇష్టపడటం లేదు. విభజన గాయంఇంకా ఏపీ ప్రజల్లో పచ్చిగానే ఉండటం.. విభజన కారణంగా ఎదురవుతున్న సమస్యలు కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతున్నాయే తప్పించి తగ్గట్లేదు. దీంతో.. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కోపం అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గట్లేదు.

ఇలాంటి వేళలో.. ఘర్ వాపసీ అంటూ రాహుల్ గాంధీ ఎంత మొత్తుకున్నా వర్కువుట్ అయ్యే పరిస్థితి లేదు. ఘర్ వాపసీ అంటే.. వివిధ కారణాలతో పార్టీని విడిచి పెట్టిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకురావాలన్నదే ప్రయత్నంగా చెబుతారు. మాటకు ఘర్ వాపసీ అని చెప్పేయటం ఈజీ కావొచ్చు.ప్రాక్టికల్ గా మాత్రం అసాధ్యమని చెప్పాలి. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు అవుతోంది. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆ మాటకు వస్తే.. ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితి. పార్టీకి చెందిన రఘువీరారెడ్డినే వ్యవసాయం చేసుకుంటూ ఊరికి పరిమితమైన పరిస్థితి.

అన్ని అంశాలు అన్ని చోట్ల వర్కువుట్ కాదు. అలానే ఏపీలోకాంగ్రెస్ కు పునర్ వైభవం గతంలో మాత్రమే కనిపిస్తుందే తప్పించి.. వర్తమానం..భవిష్యత్తులో సాధ్యం కాదు. ఒకవేళ అయితే గియితే కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరి.. ఏపీకి ప్రత్యేక హోదాను పదేళ్లు ఇచ్చి.. అద్భుతమైన రాజధాని ఏర్పాటుకు భారీగా నిధులు ఇస్తే.. అప్పుడేమైనా పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందేమో కానీ.. అప్పటివరకు మాత్రం సాధ్యం కాదు. కాన్ఫరెన్సు గదుల్లోనే తప్పించి.. ఏపీ ప్రజల మనసుల్లో ఏముందన్న విషయాన్ని అర్థం చేసుకునే వరకు ఏపీలో పార్టీ తీరు మారదన్న విషయాన్ని మర్చిపోకూడదు.