Begin typing your search above and press return to search.

రాహుల్‌... ముక్క తిని మొక్కుకెళ్లాడ‌ట‌!

By:  Tupaki Desk   |   13 Feb 2018 10:48 AM GMT
రాహుల్‌... ముక్క తిని మొక్కుకెళ్లాడ‌ట‌!
X
వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటుగా ఇటు క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే తీసుకుంటున్నాయి. క‌న్న‌డ నాట విజ‌య‌ఢంకా మోగించి... కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆ రాష్ట్రంలో గ‌ద్దె దించి అధికారం చేప‌ట్ట‌డంతో రెట్టించిన ఉత్సాహంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ యోచిస్తోంది. అదే స‌మ‌యంలో గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాభవానికి సంబంధించిన బెరుకును పార్టీ శ్రేణుల్లో నుంచి తొల‌గించాలంటే క‌న్నాడ నాట వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం అధికారం చేజిక్కించుకుని వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు డ‌బుల్ స్టామినాతో వెళ్లాల‌ని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ఇప్ప‌టికే క‌న్న‌డ నాట ర‌సవ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోదీ కూడా ఆ పార్టీ త‌ర‌ఫున క‌న్న‌డ నాట ప్ర‌చారంలో పాలుపంచుకున్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాహుల్ గాంధీ కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేసిన‌ట్లుగానే క‌నిపిస్తున్నారు. గ‌డ‌చిన నాలుగు రోజులుగా క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ గాంధీ... నిన్న బీజేపీ స‌ర్కారుపై సెటైరిక్ విమ‌ర్శ‌లు సంధించే క్ర‌మంలో రోడ్డు ప‌క్క‌గా ఓ బ‌డ్డీ కొట్టు ద‌గ్గ‌ర ఆగి బ‌జ్జీలు తెప్పించుకుని మ‌రీ ఆర‌గించారు. కేంద్రం చేస్తున్న ఉపాధి క‌ల్ప‌న వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌గానే ఆయ‌న ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు లేక‌పోలేదు. అయితే ఎంత స్పీడుగా వెళుతున్నా... రాహుల్ గాంధీ ప్ర‌త్య‌ర్థుల‌కు అడ్డంగా బుక్కైపోతున్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆల‌యాల సంద‌ర్శ‌న‌ను ప్రారంభించిన రాహుల్‌... త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో నిన్న ఆయ‌న క‌న్న‌డ‌నాట ఓ ఆల‌యాన్ని సంద‌ర్శించారు.

దీనిపై బాగానే దృష్టి పెట్టిన క‌ర్ణాక‌ట బీజేపీ చీఫ్‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ సీఎం అభ్య‌ర్థి బీఎస్ య‌డ్యూర‌ప్ప‌... రాహుల్‌పై పెద్ద సెటైరే వేశారు. ’జవారీ చికెన్‌’ తినిమరీ రాహుల్‌ ఆలయ సంద‌ర్శ‌న‌కు వెళ్లారని య‌డ్డీ ఆరోపించారు. *ఒకవైపు టెన్ పర్సెంట్ సీఎం సిద్దరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థల మంజునాథుడిని దర్శించుకుంటే.. మరోవైపు ఎన్నికల హిందువు అయిన రాహుల్‌గాంధీ జవారీ చికెన్‌ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు గాయపరుస్తోంది? ఆ పార్టీది సమాజవాదం కన్నా మజావాదం( ఎంజాయ్‌ చేయడం) ఎక్కువ కనిపిస్తోంది’ అని య‌డ్డీ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సంధించారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చికెన్ తింటున్న ఫొటోల‌తో పాటు ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్లిన ఫొటోల‌ను కూడా య‌డ్డీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.