Begin typing your search above and press return to search.

5 నెలల పాటు కంటైనర్ లోనే ఉండనున్న రాహుల్

By:  Tupaki Desk   |   8 Sep 2022 8:06 AM GMT
5 నెలల పాటు కంటైనర్ లోనే ఉండనున్న రాహుల్
X
"విద్వేషంతో.. విభజన కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. కానీ.. నేను అధికంగా ప్రేమించే నా దేశాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోను" అన్న ట్వీట్. ద్వేషాన్ని ప్రేమతో అధిగమించొచ్చని.. భయాన్ని ఆత్మవిశ్వాసంతో జయించొచ్చని.. కలిసికట్టుగా అడ్డంకుల్నిఅధిగమిద్దామంటూ ప్రజలకు పిలుపునివ్వటం ద్వారా గాంధీల కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి దేశ వ్యాప్త పాదయాత్రకు తెర తీశారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు మొత్తం 3570 కిలోమీటర్ల దూరాన్ని ఐదు నెలల వ్యవధిలో రాహుల్ గాంధీ చేపట్టనున్నారు.

మరింత ఇంత కాలం పాటు రోజువారీగా రాహుల్ బస ఎక్కడ? అన్న సందేహానికి సమాధానం చెప్పేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. వాస్తవానికి.. పాదయాత్రలో భాగంగా.. రాహుల్ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో అన్ని వసతులతో కూడిన హోటళ్లను సిద్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి.

అయితే.. అందుకు రాహుల్ గాంధీ నో చెప్పటమే కాదు.. పాదయాత్ర సందర్భంగా క్యారవాన్ లాంటి కంటైనర్ ను సిద్ధం చేయాలని చెప్పటంతో.. అలాంటిది సిద్ధం చేశారు.

ఈ వ్యాన్ లాంటి కారవాన్ లో బెడ్.. ఏసీ.. బాత్రూం లాంటి వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాహుల్ తో పాటు మరో 119 మంది సీనియర్ నేతలు ఆయన వెంట పాదయాత్ర చేపట్టనున్నారు. ఒక జాతీయ స్థాయి నాయకుడు తొలిసారి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా దీన్ని చెప్పాలి.

రాహుల్ తో కలిసి నడిచేందుకు సిద్ధమైన సీనియర్ నేతలకు వీలుగా మొత్తం 60 క్యారవాన్లను సిద్ధం చేశారు. రోజు మొత్తంలో 22 నుంచి 23 కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేశారు. జూడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల యావరేజ్ వయసు 38 ఏళ్లుగా లెక్క కట్టారు.

వరుస ఎదురుదెబ్బలతో విలవిలలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి..రాహుల్ చేస్తున్న తాజా పాదయాత్ర కొత్త ఊపిరిని ఇవ్వటంతో పాటు.. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేందుకు వీలుగా ఈ జోడో యాత్రలో పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.