Begin typing your search above and press return to search.

ఫోన్ నుంచి రైల్వే జ‌న‌ర‌ల్ టికెట్లు!

By:  Tupaki Desk   |   11 July 2018 4:42 AM GMT
ఫోన్ నుంచి రైల్వే జ‌న‌ర‌ల్ టికెట్లు!
X
చిన్న ఊళ్ల‌ల్లో ఫ‌ర్లేదు కానీ.. ప‌ట్ట‌ణాలు.. న‌గ‌రాలకు వ‌చ్చేస‌రికి ట్రైన్ టికెట్ తీసుకోవ‌టం చాలాసార్లు ఇబ్బందిక‌క‌రంగా ఉంటుంది. ఓవైపు క‌దులుతున్న ట్రైన్.. మ‌రోవైపు చాంతాడంత క్యూ.. ఏ మాత్రం ఆల‌స్య‌మైనా ట్రైన్ మిస్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. అలా అని టికెట్ లేకుండా ప్ర‌యాణిస్తే డ‌బుల్ ఇబ్బంది. రైల్వే ప్ర‌యాణికులకు త‌ర‌చూ ఎదుర‌య్యే ఈఇబ్బందిని అధిగ‌మించ‌టానికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స‌రికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది.

జ‌న‌ర‌ల్ టికెట్ ను సైతం ఆన్ లైన్లో తీసుకోవ‌టానికి వీలుగా కొత్త స‌దుపాయాన్ని ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ కొత్త విధానాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. యూటీఎస్ ఆన్ మొబైల్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

ట్రైన్ రిజ‌ర్వ్డ్ టికెట్ల‌ను.. జ‌న‌ర‌ల్ టికెట్ల‌ను ఆన్ లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్ప‌టికే కొన్ని రైల్వే జోన్లు ఈ స‌దుపాయాన్ని ఏర్పాటు చేయ‌గా.. కాస్త ఆల‌స్యంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తాజాగా ఈ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ను మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకొని జ‌న‌ర‌ల్ టికెట్ ను తీసుకునే వెసులుబాటు ఉంది.

యాప్ ద్వారా టికెట్ ను తీసుకోవాలంటే ముందుగా యాప్ ను డౌన్ లోడ్ చేసి.. వివ‌రాల్ని పూర్తి చేయ‌టంతో పాటు రైల్వే వాలెట్ లో కొంత న‌గ‌దు జ‌మ చేయాల్సి ఉంటుంది. యాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ ను ర‌ద్దు చేసుకునే వెసులుబాటు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న మ‌రోరెండు రోజుల్లో వెలువ‌డ‌నుంద‌ని చెబుతున్నారు.