Begin typing your search above and press return to search.

తెలుగురాష్ట్రాలకు మరిన్ని వందేభారత్ లు ఎప్పుడో చెప్పేసిన రైల్వే మంత్రి

By:  Tupaki Desk   |   17 Jan 2023 9:02 AM GMT
తెలుగురాష్ట్రాలకు మరిన్ని వందేభారత్ లు ఎప్పుడో చెప్పేసిన రైల్వే మంత్రి
X
తెలుగు రాష్ట్రాలకు తీపికబురు చెప్పారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. వందేభారత్ సిరీస్ లో భాగంగా మరిన్ని రైళ్లు త్వరలో తెలుగు రాష్ట్రాలకు రానున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు సీటింగ్ వందే భారత్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో.. తెల్లవారుజామున మొదలయ్యే ఈ సర్వీసు.. రాత్రి అయ్యేసరికి తమ గమ్యస్థానానికి చేరుకునేలా ప్లాన్ చేయటం తెలిసిందే. అంటే ఉదయాన్నే బయలుదేరి.. గమ్యస్థానానికి చేరి.. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టి.. ఎక్కడైతే రైలు బయలుదేరిందో అక్కడికి చేరుకునేలా ప్లాన్ చేయటం తెలిసిందే.

ఇటీవల స్లీపర్ బెర్తులతో కూడిన వందే మెట్రో రైలు డిజైన్ పూర్తి అయ్యిందని.. త్వరలోనే వాటి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా మరో ఆరు నెలల కంటే తక్కువ కాలంలోనే ఈ బెర్తు రైళ్లు అందుబాటులోకి రానున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నంకు ఉన్న వందే భారత్ ట్రైన్ రానున్న రోజుల్లో సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి విజయవాడలకు వందే భారత్ ట్రైన్లను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

మూడేళ్లలో 475 వందే భారత్ రైళ్లను తీసుకురావాలన్న ప్రయత్నం ప్రస్తుతానికి ఎనిమిది రైళ్లు పట్టాలెక్కాయి. దేశంలో మొత్తం 75 నగరాల్ని వందే భారత్ రైళ్లతో అనుసంధానిస్తారు. ఇందులో భాగంగా ప్రస్తుతానికి 30 నగరాలు పూర్తి అయ్యాయి.

ప్రతి పది రోజులకు ఒక కొత్త సర్వీసును తీసుకొచ్చేలా తాము ప్లాన్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరులో అంటే.. రిపబ్లిక్ డేకు ఒకట్రెండు రోజుల ముందు మరో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు.

మొదటి విడతలో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లు వచ్చే వీల్లేదు. రెండో దశలో మాత్రం తెలంగాణ.. ఏపీలోని అన్ని ప్రధాన నగరాలను వందే భారత్ తో అనుసంధానం చేయనున్నారు. అయితే.. వందే భారత్ రైళ్ల వేగ సామర్థ్యం గంటకు 130 కిలోమీటర్లు ఉన్నప్పటికి.. ఇప్పుడు 110 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లనుంది.

అయితే.. ట్రాక్ సామర్థ్యాన్ని పెంచటం ద్వారా రానున్న ఏడాది.. ఏడాదిన్నర కాలంలో గంటకు 160కి.మీ. ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లోమరిన్ని వందే భారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు రానున్నాయన్న తీపికబురు కేంద్ర రైల్వే మంత్రి నుంచి రావటం కాస్తంత ఊరటనిచ్చే అంశంగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.