Begin typing your search above and press return to search.

రైల్వే జోన్ ఏపీకెందుకో చెప్పమంటున్నారు

By:  Tupaki Desk   |   18 Feb 2017 6:59 AM GMT
రైల్వే జోన్ ఏపీకెందుకో చెప్పమంటున్నారు
X
రౌతును బట్టే గుర్రం తీరు ఉంటుంది. పాలకులకు తగ్గట్లే అధికారుల మాటలు ఉంటాయి. ఏపీ పట్ల మోడీ సర్కారు తీరుకు తగ్గట్లే కేంద్రంలోని అధికారులు వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. రాజకీయనేతల నోటి నుంచి కాస్త ఎక్కువ తక్కువ మాటలు రావటం చూస్తుంటాం. కానీ.. సీనియర్ అధికారులు తాము మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడుతుంటారు. వివాదాస్పదం అయ్యే అవకాశం ఉన్న మాటల్ని ప్రస్తావించటం తర్వాత.. వాటి గురించి మీడియా అడిగినా.. వాటికి మౌనమే సమాధానంగా వ్యవహరిస్తారే కానీ పెదవి విప్పటానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ మాట్లడాల్సి వస్తే.. సంబంధం లేని మాటల్ని చెప్పేసి.. అప్పటికి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తారే కానీ.. మాట్లాడే సాహసానికి ప్రయత్నించరు.

తాజాగా చూస్తే.. ఇలాంటి జాగ్రత్తలేమీ తీసుకునే ఆలోచనలో రైల్వే అధికారులు లేనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న హామీల్లో కీలకమైనది ఏపీకి రైల్వే జోన్ వ్యవహారం. ఒక్కసారి రైల్వే జోన్ కానీ విశాఖకు వచ్చేస్తే.. జోన్ స్థాయిలో వచ్చే మార్పులు చాలానే ఉంటాయి. నిధుల కేటాయింపు మొదలు.. చాలా అంశాల్లో మార్పులు భారీగా చోటు చేసుకుంటాయి. మొత్తంగా రైల్వేల పరంగా ఏపీ కేంద్రంగా మారటంతో పాటు.. ఏపీ అభివృద్ధికి కీలకంగా మారే అవకాశాలు ఎక్కువ.

విశాఖ జోన్ ను ఏర్పాటు చేస్తే.. తమ ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయని మిగిలిన రాష్ట్రాలు బలంగా వాదించటంతోనే ఏపీకి ఇవ్వాల్సిన రైల్వే జోన్ ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. జోన్ ఇష్యూను కేంద్ర నేతల్ని పలుమార్లు ప్రశ్నించిన మీడియాతో.. సున్నితమైన అంశమని.. దీన్ని సరైన సమయంలో పరిష్కరిస్తామన్న మాటలు చెప్పటాన్ని మర్చిపోకూడదు. జోన్ గురించి కాస్తంత స్వేచ్ఛగా మాట్లాడటానికి రాజకీయ నేతలే వెనక్కి తగ్గుతున్న వేళ.. రైల్వే అధికారులు చేసిన వ్యాఖ్యలు గర్హనీయమే కాదు.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపుల్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా.. ఏపీ రైల్వే జోన్ గురించి ప్రస్తావించిన మీడియా ప్రతినిధులతో.. సీనియర్ అధికారులు చెప్పిన మాటలు షాకింగ్ గా మారాయి. రైల్వే జోన్ మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించని వారు.. ‘‘రైల్వే జోన్ తో ఏపీకి ఏం ఉపయోగమో చెప్పండి’’ అంటూ ఎదురుప్రశ్న వేసిన వైనం చూస్తే..ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందా? అన్న సందేహం కలగక మానదు.

‘‘ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ ఇష్యూ మాకు తెలుసు. రైల్వే బోర్డులోని ముగ్గురు అదికారులతో కూడిన కమిటీ దానిపై పని చేస్తోంది. అన్నికోణాల్లో అది అధ్యయనం చేస్తోంది. దాని వల్ల రాష్ట్రానికి ఎలా లాభం జరుగుతుందో చెప్పాలి’’ అని ప్రశ్నించిన తీరును చూస్తే.. వారే మైండ్ సెట్ లో ఉన్నారన్నది ఇట్టే అర్థమవుతుంది. కోట్లాది ఆంధ్రుల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా మాట్లాడే ప్రయత్నం చేసిన రైల్వే అధికారుల బలుపు మాటను ఆంధ్రాప్రాంతానికి చెందిన నేతలు ఖండిస్తారా? కామ్ గా ఉంటారా? అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/