Begin typing your search above and press return to search.

చెప్పినా వినని 7 వేల మంది మగాళ్లను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

By:  Tupaki Desk   |   3 Jun 2022 2:49 AM GMT
చెప్పినా వినని 7 వేల మంది మగాళ్లను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు
X
చెప్పిన మాట వినని మగాళ్ల విషయంలో సీరియస్ అయ్యింది రైల్వే శాఖ. మాటలతో ఎన్నిసార్లు చెబుతున్నా వినని వారికి చేతల్లో చూపించటం ద్వారా షాకిచ్చారు. భారత రైల్వేలలో మహిళల భద్రత విషయంలో తామెంత ప్రాధాన్యత ఇస్తామన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వెల్లడించారు.

రైళ్లలో ప్రయాణించే సమయంలో మహిళా కోచ్ లలో పురుషులకు చోటు ఉండదు. నిబంధనలకు విరుద్ధంగా మహిళా కోచ్ లలో మగాళ్లు ఎంట్రీ ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటారు. అయితే.. ఇంతకాలం మహిళల కోచ్ లలో ప్రయాణించే పురుషులకు వార్నింగ్ ఇచ్చేవారు.

ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరించారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు. మే 3 నుంచి 31 మధ్య కాలంలో ఆపరేషన్ మహిళా సురక్ష ప్రోగ్రాంను చేపట్టారు. ఇందులో మహిళల భద్రతకు భంగం వాటిల్లే అంశాల్లో సీరియస్ గా తీసుకుంది.

మహిళలకు కేటాయించిన కోచ్ లలో వారితో పాటు ఆ కోచ్ లలో ఎక్కే మగాళ్లు ఏడు వేల మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. మొత్తం 223 స్టేషన్ల పరిధిలో 283 పోలీసు టీంలు తనిఖీలు నిర్వహించారు.

రోజుకు 1125 మంది మహిళా ఆర్పీఎఫ్ పోలీసులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా ప్రయాణిస్తున్న వారిని అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు.

అంతేకాదు.. రైళ్లలో ప్రయాణించే 2.25 లక్షల మంది మహిళలతో మాట్లాడి.. రైలు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అంతేకాదు.. రైలు దిగే వేళలో జారి పడిపోతున్న పది మంది మహిళల్ని రక్షించటం గమనార్హం. సో.. రైళ్లలో ప్రయాణించే వారు.. సరదా కోసమైనా సరే మహిళల కోచ్ లలో ఎక్కాలన్న పిచ్చ పనికి ఫుల్ స్టాప్ పెట్టకుంటే అరెస్టు కావటం ఖాయమన్నది మర్చిపోకూడదు సుమా.