Begin typing your search above and press return to search.

రైల్లో పాపకు పాలు తెచ్చి ఇచ్చిన ట్వీట్

By:  Tupaki Desk   |   15 March 2017 4:38 AM GMT
రైల్లో పాపకు పాలు తెచ్చి ఇచ్చిన ట్వీట్
X
ఆకలి తాళ లేక పాల కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న ఒకపాప ఆకల్నితీర్చిందో ట్వీట్. క్రెడిట్ ట్వీట్ కే కాదు.. ఒక్క ట్వీట్ కే స్పందించిన రైల్వే శాఖకు.. కేంద్ర రైల్వే మంత్రికి ఇవ్వాల్సిందే. ఈ ఉదంతం గురించి తెలిసిన వారందరిని కదిలిస్తున్న ఈ వైనంలోకి వెళితే.. ఐదునెలల చిన్నారితో ఒక జంట హప్పా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తోంది. గుజరాత్ నుంచి తిరునెల్వేలికి వెళ్లే ఈ ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న సదరు జంట పాప కోసం తయారుగా ఉంచిన పాలు చెడిపోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి.

స్టేషన్ రావటానికి మరికొద్ది గంటల పట్టే పరిస్థితి. మరోవైపు ఆకలితో పాప ఏడుస్తూ ఉంది. ప్యాంటీ సిబ్బంది దగ్గర కూడా పాలు లేని పరిస్థితి. దీంతో పాప తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచని పరిస్థితి.ఇలాంటి వేళ.. ట్రైన్లో ప్రయాణిస్తున్న నేహా బాపట్ అనే ప్రయాణికురాలికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆమె జరిగిన విషయాన్ని తన స్నేహితులకు వివరిస్తూ పాలు కావాలంటూ ట్వీట్ చేసింది.

నేహా స్నేహితురాలు అనఘ ఈ విషయాన్ని కొంకణ్ రైల్వేల దృష్టికి తీసుకెళ్లింది. తమకు సాయం చేయాలని అర్థించింది. వెంటనే స్పందించిన కొంకణ్ రైల్వే.. పాప ప్రయాణిస్తున్న రైలు.. బోగీ వివరాలు కోరారు. అయితే.. పాప తల్లిదండ్రులు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న విషయాన్ని చెప్పినా.. అధికారులు పాపకు అవసరమైన పాలను కొలాడ్ స్టేషన్లో అందజేశారు. ఈఉదంతం రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులే కాదు.. ఈ విషయం తెలిసిన వారంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆకలి తీర్చటంలో కీలకభూమిక పోషించిన రైల్వే అధికారులు.. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు థ్యాంక్స్ చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/