Begin typing your search above and press return to search.

ఏంది మోడీ సాబ్? ‘రాయితీ’ ఎత్తేసి వయోవృద్ధులకు ఇంతలా షాకివ్వాలా?

By:  Tupaki Desk   |   21 July 2022 4:12 AM GMT
ఏంది మోడీ సాబ్? ‘రాయితీ’ ఎత్తేసి వయోవృద్ధులకు ఇంతలా షాకివ్వాలా?
X
భార‌తీయ రైల్వే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు, జ‌ర్న‌లిస్టుల‌కు, విద్యార్థుల‌కు షాక్ ఇచ్చింది. రైల్వే టికెట్ ధరపై వృద్ధుల‌కు ఇస్తున్న‌ రాయితీని తొలగించింది. వాస్త‌వానికి కోవిడ్ స‌మ‌యంలోనే అన్ని రాయితీల‌ను రైల్వే శాఖ ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర సిటిజన్ల‌కు, విద్యార్థుల‌కు, జ‌ర్న‌లిస్టులు, తదిత‌రుల‌కు ఇచ్చే రాయితీని నిలిపేసింది. ఆ త‌ర్వాత‌ వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని ఇటీవల రైల్వేశాఖకు అనేక సార్లు విజ్ఞప్తులు వచ్చాయి. కొంత‌మంది ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం కింద కోర్టుల‌ను సైతం ఆశ్ర‌యించారు. కోర్టు కూడా ఈ అంశాన్ని ప‌రిశీలించాల‌ని రైల్వే శాఖ‌ను ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో స్పందించిన రైల్వే శాఖ వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. టిక్కెట్ రాయితీల గురించి పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ మేర‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాయితీల వల్ల రైల్వేశాఖపై పెనుభారం పడుతోందని ఆయన వివరించారు.

రాయితీ వల్ల 2017-20 మధ్య రూ.4,794 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేపై ఈ స్థాయిలో భారం పడ‌టం వ‌ల్లే రాయితీలను రద్దు చేశామని తెలిపారు.

సీనియర్‌ సిటిజన్లు సహా అన్ని వర్గాల ప్రయాణికుల వల్ల ఇప్పటికే సగటున 50 శాతం ఖర్చును రైల్వే శాఖ భరిస్తోందని.. దీనివ‌ల్ల రైల్వేలు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని వివ‌రించారు.

మ‌రోవైపు రైల్వే టికెట్‌ ధరలు తక్కువగా ఉండటం కూడా రైల్వేల నష్టానికి కారణమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. కరోనా కారణంగా 2019-20తో పోలిస్తే ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందన్నారు. దీంతో దీర్ఘకాలంలో రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం ప‌డుతోంద‌ని అభిప్రాయపడ్డారు. అందువల్ల సీనియర్‌ సిటిజన్లు సహా అన్ని కేటగిరీల వారికీ రాయితీ పునరుద్ధరణ అనేది కుద‌ర‌దని స్ప‌ష్టం చేశారు.

కాగా గతంలో 50 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు రైల్వే శాఖ 50 శాతం రాయితీ కల్పించేది. అదేవిధంగా 60 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు 40 శాతం రాయితీని అందించేది. జ‌ర్న‌లిస్టులు, జాతీయ స్థాయి ప‌రీక్ష‌ల‌కు, వివిధ నియామ‌క ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యేవారికి, విద్యార్థులు, దివ్యాంగులు త‌దితరుల‌కు రాయితీలు ఉండేవి. వీట‌న్నింటిని రైల్వే శాఖ ర‌ద్దు చేసింది.