Begin typing your search above and press return to search.

సుజ‌నా మాట‌..రైల్వే జోన్ సాధ్యం కాదు

By:  Tupaki Desk   |   26 Jan 2018 7:41 AM GMT
సుజ‌నా మాట‌..రైల్వే జోన్ సాధ్యం కాదు
X
ప్ర‌త్యేక రైల్వే జోన్‌...సుదీర్ఘ కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసుల ఆకాంక్ష‌. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆనాటి ప్ర‌భుత్వం ఈ క‌ల‌ను నెరవేరుస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ-బీజేపీ ద్వ‌యం తాము సాకారం చేసి చూపిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. అయితే అడుగు ముందుకుప‌డ‌లేదు. సాక్షాత్తు కేంద్ర రైల్వే శాఖా మంత్రి ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ‌డంతో ఆశ‌లు చిగురించాయి. అయితే ఆయ‌న శాఖ మార‌డంతో ఆశ‌లు మ‌రింత స‌న్న‌గిల్లాయి. అలాంటి ఎపిసోడ్‌ పై తాజాగా మ‌రో పిడుగు ప‌డింది. విశాఖకు రైల్వేజోన్‌ సాధ్యం కాదని కమిటీలు తేల్చేశాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు.

విశాఖలో నిర్వహించిన బీయాన్‌ ఎంటర్‌ పెన్యూర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సుజనాచౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ మనుగడ సాధ్యపడదని ఈ ప్రాజెక్టు విషయమై అధ్యయనం చేసిన రైల్వే టెక్నికల్ కమిటి నివేదిక తేల్చి చెప్పినట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కి ఈ బడ్జెట్ ముందైనా మోక్షం కలిగే అవకాశం ఉందా?...అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ...బడ్జెట్ తో విశాఖ రైల్వే జోన్ కి సంబంధం లేదన్నారు. అయినా 99 శాతం జోన్ వస్తుందనే అశిస్తున్నామని - ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సుజనా చౌదరి వివరించారు. ఈ బ‌డ్జెట్ త‌ర్వాత కేంద్రంపై విబ‌జ‌న హామీల విష‌యంలో త‌మ కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

కాగా, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ ఐడిఎం)ను కూడా ఏపీలో ఏర్పాటు చేయ‌బోవ‌డం లేద‌ని కేంద్ర వ‌ర్గాలు స‌మాచారం ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్‌ ఐడీఎం దక్షిణాది ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొనగా ఇప్పుడు "ఇతరత్రా కారణాల"రీత్యా ఈ కేంద్రాన్నిమరో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని కేంద్రం నుంచి స‌మాచారం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తరచూ వరదలు సంభవించే ఏపీలో ఈ ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు ఎన్‌ ఐడీఎం అవసరం ఉంది. ఈ సంస్థ ఆవశ్యకత - ప్రాధాన్యతను గుర్తించే ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఎన్‌ ఐడీఎం కోసం పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. ఈ క్ర‌మంలో కేంద్రం ఇలాంటి ట్విస్ట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

తాజా ప‌రిణామం ఏపీ ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా ఏపీ స‌ర్కారుకు షాక్ వంటిదని అంటున్నారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ - ప్రత్యేక హోదాపై మాట‌త‌ప్పిన స‌మ‌యంలోనే లైట్ తీసుకున్న నేప‌థ్యంలో త‌మ హామీలు అమ‌లు చేసే విష‌యంలో కేంద్రం సీరియ‌స్‌గా లేద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీకి కీల‌క‌మైన హోదాను లైట్ తీసుకోవ‌డం - వివిధ జాతీయ సంస్థలను కేటాయించినా...వాటి నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు అందించకపోవడం - విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ విష‌యంలో మొండి చెయ్యి - ఎన్‌ ఐడీఎం వంటి విష‌యాల్లో మాట‌మార్చ‌డం వంటివి కేంద్రం శీత‌క‌న్ను నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం సీఎం చంద్ర‌బాబు పోరాటం చేయ‌డంతో పాటుగా అన్నిప‌క్షాల‌ను క‌లుపుకొని పోవాల‌ని పేర్కొంటున్నారు.