Begin typing your search above and press return to search.

రైల్లో ఎలుక కొరికింది..ఎంత ప‌రిహారం చెల్లించారంటే?

By:  Tupaki Desk   |   30 Aug 2018 5:40 AM GMT
రైల్లో ఎలుక కొరికింది..ఎంత ప‌రిహారం చెల్లించారంటే?
X
రైల్లో ప్ర‌యాణించేట‌ప్పుడు బొద్దింక‌లు.. ఎలుక‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో తీసుకెళ్లే వ‌స్తువుల్ని.. వెంట ఉండే బ్యాగుల్ని కొట్టేస్తుంటాయి. మ‌రో అడుగు వేసి కొన్ని రైళ్ల‌ల్లో ప‌డుకున్న ప్ర‌యాణికుల్ని సైతం క‌రిచివేసే ఉదంతాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. ఇదే రీతిలో రైల్లో ఎలుక కొర‌క‌టం కార‌ణంగా గాయ‌ప‌డిన ప్ర‌యాణికుడికి ప‌రిహారం చెల్లించాలంటూ రైల్వేశాఖ‌ను ఆదేశించింది సేలం వినియోగ‌దారుల ఫోరం.

సేలం జిల్లా వాళ‌ప్పాడి తాలూకా నీర్ ముళ్లికుట్టైకు చెందిన వెంక‌టాచ‌లం (40) 2014లో సేలం నుంచి చెన్నై ఎగ్మూర్ వెళ్లే ట్రైన్లో ప్ర‌యాణించారు. ఈ ప్ర‌యాణంలో ఆయ‌న్న ఎలుక కొరికింది. దీనిపై టీటీఈకి ఫిర్యాదు చేయ‌గా నిర్ల‌క్ష్యంగా బ‌దులిచ్చారు. దీంతో.. చెన్నై ఎగ్మోర్ చేరుకున్న త‌ర్వాత ఫిర్యాదు చేసి ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందారు.

రైల్లో ఎలుక కొర‌క‌టం.. రైల్వే అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అంశంపై తాను ప‌డిన మాన‌సిక క్షోభ‌పై సేలం వినియోగ‌దారుల ఫోరంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీనిపై విచార‌ణ జ‌రిపిన ఫోరం చ‌లంకు రూ.32వేల ప‌రిహారాన్ని చెల్లించాల్సిందిగా రైల్వేశాఖ‌ను ఆదేశించారు. మాన‌సిక్ష క్షోభ‌కురూ.25వేలు.. వైద్య ఖ‌ర్చుల‌కు రూ.2వేలు.. కేసు ఖ‌ర్చుల‌కు రూ.5వేలు క‌లిపి మొత్తంగా రూ.32వేల మొత్తాన్ని బాధితుడికి అంద‌జేయాల‌ని ఆదేశించారు. ఆదేశాలు జారీ చేసిన వెంట‌నే ప‌రిహారాన్ని చెల్లించ‌కుంటే.. తొమ్మిది శాతం వ‌డ్డీతో పిటిష‌న్ దాఖ‌లు చేసిన నాటి నుంచి బాధితుడికి చెల్లించాల‌ని పేర్కొన్నారు. రైల్లో ప్ర‌యాణించేట‌ప్పుడు అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా జ‌రిగే న‌స్టాన్ని పోరంలో ప్ర‌శ్నించ‌టం ద్వారా.. అధికారులు మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించేలా చేయొచ్చ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.