Begin typing your search above and press return to search.

భార‌త్-పాక్ మ్యాచ్ కు వ‌ర్ష‌మే అస‌లు విల‌న్‌!

By:  Tupaki Desk   |   16 Jun 2019 5:57 AM GMT
భార‌త్-పాక్ మ్యాచ్ కు వ‌ర్ష‌మే అస‌లు విల‌న్‌!
X
అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న భార‌త్ - పాక్ మ‌ధ్య మ్యాచ్ కు వ‌ర్షం విల‌న్ కానుంది. కోట్లాది మంది ఆశ‌ల మీద వాన జోరు భారీగా కుర‌వ‌నున్న‌ట్లుగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. మ్యాచ్ జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది క్రికెట్ అభిమానుల‌కు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మ్యాచ్ లో త‌మ జ‌ట్టు గెల‌వాల‌న్న దాని కంటే.. ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోకుండా ఉండాల‌ని వారు త‌పిస్తున్నారు.

వాన కార‌ణంగా ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్ లు ఆగినా ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కానీ..ఈ మ్యాచ్ మాత్రం క‌చ్ఛితంగా జ‌ర‌గాల్సిందేనని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నారు. కోట్లాది మంది ఆశ‌లు ఇలా ఉన్న వేళ‌.. మాంచెస్ట‌ర్ లో ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది చూస్తే.. అక్క‌డ వాతావ‌ర‌ణం మ్యాచ్ జ‌రిగేందుకు సానుకూలంగా ఎంత‌మాత్రం లేద‌న్న మాటను చెబుతున్నారు.

ఇంగ్లండ్ లోని వాతావ‌ర‌ణం గురించి అంచ‌నా వేసే ఏజెన్సీల‌న్ని మ్యాచ్ కు వ‌రుణుడి క‌రుణ లేద‌ని తేల్చి చెబుతున్నారు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యానికి వాన‌కు అవ‌కాశం ఉందంటున్నారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత వాన మ‌రింత పెరగ‌టం ఖాయ‌మంటున్నారు. శ‌నివారం వాతావ‌ర‌ణం బాగానే ఉండి.. కాస్త ఎండ కూడా కాసింది. భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన కాసేప‌టికే వ‌ర్షం మొద‌లైంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10 గంట‌ల వేళ‌లోనూ మాంచ‌స్ట‌ర్ లో వ‌ర్షం భారీగా కురిసింది. పిచ్ ను క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచినా ఔట్ ఫీల్డ్ ప‌నితీరుపైన సందేహాలు ఉన్నాయి. చిన్న జ‌ల్లుల‌కే మైదానంలో ప‌లు చోట్ల వ‌ర్షం నీళ్లు నిలిచిపోవ‌టం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్ మీద పెద్ద ఎత్తున బిజినెస్ న‌డుస్తుంద‌న్న ఆశ‌లు పెట్టుకున్నవారికే కాదు.. ప‌లు విభాగాలు పెద్ద ఎత్తున న‌ష్టాలు మూట‌క‌ట్టుకోవ‌టం ఖాయ‌మంటున్నారు. మ్యాచ్ జ‌ర‌గ‌కుండా అంతా న‌ష్ట‌మేన‌ని.. ఇది దాదాపు వంద‌ల‌ కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మ్యాచ్ కోసం రూ.20వేల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టి కొన్న అభిమానుల పరిస్థితి దారుణంగా ఉంది. వారంతా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్ రూ.20వేలు మొద‌లు రూ.62 వేల వ‌ర‌కూ ఉంది. మ్యాచ్ కానీ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే ఇంత భారీ ధ‌ర‌కుటికెట్లు కొన్న వారి వేద‌న‌కు అంతు ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.