Begin typing your search above and press return to search.

ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం.. భారీగా ప్రాణ న‌ష్టం..!

By:  Tupaki Desk   |   18 July 2021 12:30 PM GMT
ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం.. భారీగా ప్రాణ న‌ష్టం..!
X
దేశ ఆర్థిక‌ రాజ‌ధాని ముంబైని భారీ వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి కురుస్తున్న వ‌ర్షాల‌తో ముంబైలోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. కొన్ని గంట‌ల‌పాటు కురిసిన జ‌డివాన‌తో లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నీట మునిగిపోయాయి. అంతేకాదు.. న‌గర శివార్ల‌లో కొండ చ‌రియ‌లు కూడా భారీగా విరిగి ప‌డుతున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోవ‌డం విషాదం. ఇంకా.. అనేక మంది గాయ‌ప‌డ్డారు.

ముంబై ఈశాన్య ప్రాంతంలోని చెంబూర్ లో ఆదివారం తెల్ల‌వారు జామున భారీగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అవ‌న్నీ నివాస ప్రాంతాల మీద‌నే ప‌డ‌డంతో.. భారీగా ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఇళ్ల‌న్నీ ధ్వంసం కావ‌డంతో.. ఆస్తి న‌ష్టం కూడా భారీగానే సంభ‌వించింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు, బృహ‌న్ ముంబై మునిసిప‌ల్ అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

ప్ర‌ధానంగా.. చెంబూర్‌, చునాభ‌ట్టీ, దాద‌ర్‌, సియోన్, కుర్లా, మాతుంగ‌, గాంధీ మార్కెట్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గంట‌ల కొద్దీ ఆగ‌కుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌డంతో.. ఇళ్లు పూర్తిగా నేల‌మ‌ట్టం అయ్యాయి. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి ప‌ద‌కొండు మంది ప్రాణాలు కోల్పోగా.. 15 మంది వ‌ర‌కు గాయాల‌పాల‌య్యారు.

ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌తోపాటు స్థానిక పోలీసులు, రెస్కూ సిబ్బంది రంగంలోకి దిగి స‌హాయం చేస్తున్నారు కొండ చెరియ‌ల‌ను తొల‌గిస్తున్నారు. శిథిలాల కింద ప‌లువురు బాధితులు చిక్కుకొని ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మునిసిప‌ల్ అధికారులు హెచ్చ‌రించారు.