Begin typing your search above and press return to search.

అలాంటోళ్లే కాంగ్రెస్ కు దొరుకుతారేమి చెప్మా?

By:  Tupaki Desk   |   13 July 2016 4:41 AM GMT
అలాంటోళ్లే కాంగ్రెస్ కు దొరుకుతారేమి చెప్మా?
X
మరికొద్ది నెలల్లో దేశంలో అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేపట్టే కార్యక్రమంలో భాగంగా తాజాగా పార్టీ సారథిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నాటి ప్రముఖ సినీనటుడు.. రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్ ను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో నలుగురు సీనియర్ నేతల్ని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా నియమించిన నలుగురు ఉపాధ్యక్షుల్లో ఇద్దరు అత్యంత వివాదాస్పద నేతలు కావటం. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అవాకులు చవాకులు పేలటమే కాదు.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్రమోడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ అయిన ఇమ్రాన్ మసూద్ ను ఒక ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేస్తే.. 2005లో పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి ముడుపులు తీసుకున్న ఉదంతంలో సభ నుంచి సస్పెండ్ అయిన రాజారామ్ పాల్ మరొకరు.

బీఎస్పీలో ఉంటూ.. రెండుసార్లు ఎంపీ అయిన ఆయన్ను ఆ పార్టీ తొలగించిన నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఇలా వివాదాస్పద వ్యక్తులకు కీలకమైన పదవులు అప్పజెప్పటంపై పలువురు పెదవి విరుస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో చేసిన ఎంపిక ఏమాత్రం బాగోలేదని.. లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంత పెద్దరాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడపగలిగే సరైన వ్యక్తులు నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీకి దొరకటం లేదా అన్న సందేహం తాజా ఎంపిక చూస్తే కలగక మానదు.