Begin typing your search above and press return to search.

సుప్రీం చెబితే వినాలని లేదంటున్న రాజ్ ఠాక్రే

By:  Tupaki Desk   |   25 Aug 2016 11:21 AM GMT
సుప్రీం చెబితే వినాలని లేదంటున్న రాజ్ ఠాక్రే
X
కృష్ణాష్టమి సందర్భంగా దహీ హండీ కొట్టడంపై సుప్రీం ఆంక్షలు విధించడంపై అక్కడ వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. నవ నిర్మాణసేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అయితే సుప్రీం ఆదేశాలను ధిక్కరించి తీరుతామని చెబుతున్నారు. అంతేకాదు... సుప్రీం ఆదేశాలేమైనా చట్టమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ముంబైలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఒక సామాజిక కార్యకర్త వేసిన కేసు విచారించిన సందర్భంగా ఇటీవల సుప్రీం పలు సూచనలు చేసింది. మైనర్లను ఈ వేడుకల్లో పాల్గొననివ్వవద్దని - మానవ పిరమిడ్లు 20 అడుగులకు మించిన ఎత్తులో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఎమ్మెన్నెస్ కార్యకర్తలు ఇప్పటికే పలు చోట్ల ఉల్లంఘించారు. రాజ్ ఠాక్రే కూడా ఇప్పటికే పలుమార్లు ఈ విషయంలో కోర్టుపై మండిపడడమే కాకుండా తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలంటే చట్టమేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు తాను సిద్ధమని అన్నారు. మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదని, అవి కేవలం ఆదేశాలని ఆయన చెప్పారు. అందుకే తాను మీకు ఇష్టమొచ్చిన ఎత్తులో మానవ పిరమిడ్లు పెట్టుకోండని ప్రజలకు సూచించానని ఆయన అన్నారు.

కాగా నవనిర్మాణ కార్యకర్తలు యువత థానేలో హల్ చల్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడానికి పోటీ పడుతున్నారు. థానేలో నవనిర్మాణ సేన పార్టీ కార్యకర్తలు ఐ విల్ బ్రేక్ ద లా అని రాసి ఉన్న టీ షర్టులు ధరించి తిరుగుతున్నారు. ఒక చోట 40 అడుగుల ఎత్తున మానవ పిరమిడ్ ఏర్పరిచి ఉట్టి కొట్టారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన పోలీసు - ప్రభుత్వ వ్యవస్థ ఏమీ చేయలేక దిక్కులు చూస్తోంది.