Begin typing your search above and press return to search.

ఉత్తర భారతీయులపై రాజ్ థాక్రే మాటల దుమారం

By:  Tupaki Desk   |   3 Dec 2018 8:12 AM GMT
ఉత్తర భారతీయులపై రాజ్ థాక్రే మాటల దుమారం
X
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే మరోసారి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు వలసవచ్చిన ఉత్తర భారతీయులను ఉద్దేశించి ‘ఆత్మగౌరవం లేనివాళ్లు’ అంటూ విమర్శించారు. ముంబైలోని నిర్వహించిన ఉత్తర భారతీయ మహా పంచాయత్ కార్యక్రమంలోపాల్గొన్న ఆయన ఉత్తర భారతీయులపై హాట్ కామెంట్ చేశారు. ‘ఇతర రాష్ట్రాలకు వలసవచ్చి మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని.. మీకు అసలు ఆత్మగౌరవం లేదంటూ’ పేర్కొనడం దుమారం రేపింది.

దేశానికి అత్యధికమంది ప్రధానులను అందించిన ఘనత ఉత్తరప్రదేశ్ దేనని.. ప్రస్తుత ప్రధాని కూడా వారణాసి నుంచి ఎన్నికైన వ్యక్తేనని రాజ్ థాక్రే విమర్శించారు. ఇంతమంది ప్రధానులు ప్రాతినిధ్యం వహించినా యూపీ ఇంకా వెనుకబడి ఉందని ఆయన విమర్శించారు. ఉపాధి - ఉద్యోగాలు లేక వారంతా ముంబైకి వస్తున్నారని రాజ్ థాక్రే చెప్పుకొచ్చారు. యూపీతోపాటు బీహార్ - జార్ఖండ్ - బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఉపాధి కోసం ఇక్కడికే వస్తారని తెలిపారు. మీకు, మీ నాయకులకు ఆత్మగౌరవం నిజంగా ఉంటే ముఖ్యమంత్రిని - ప్రధానిని నిలదీసేవారని రాజ్ థాక్రే దెప్పిపొడిచారు. మీరు వలసవచ్చిన స్థానిక భాషలను - సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలని వారికి హితవు పలికారు.

ముంబైకి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు ఎక్కువయ్యాయని రాజ్ థాక్రే తెలిపారు. ముంబైకి 48 రైళ్లు నిండుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తే.. వెళ్లేటప్పుడు ఖాళీగా వెళతాయని ఆయన తెలిపారు. ఈ రకంగా ముంబైకి వస్తే మహారాష్ట్ర పరిస్థితి ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ప్రజలకు ఉపాధి దూరం అవుతుంది కదా అని దుయ్యబట్టారు. తనకు ఇతర రాష్ట్రాల ప్రజలపై కక్ష లేదని.. మహారాష్ట్ర ప్రజల బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.