Begin typing your search above and press return to search.

ఇలా జైలు.. అలా బెయిల్‌.. రాజాసింగ్ కేసులో భారీ ట్విస్ట్‌!

By:  Tupaki Desk   |   23 Aug 2022 2:33 PM GMT
ఇలా జైలు.. అలా బెయిల్‌.. రాజాసింగ్ కేసులో భారీ ట్విస్ట్‌!
X
తెలంగాణ‌కు చెందిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ గా మారిన బీజేపీ నాయ‌కుడు రాజాసింగ్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇలా జైలు శిక్ష విధించిన కోర్టు.. ఆ వెంట‌నే అలా బెయిల్ ఇచ్చేసింది. ఆద్యంతం ఆస‌క్తిగా మారిన ఈ కేసులో ఇది మ‌రింత ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై మంగళ్‌హాట్ పీఎస్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ క్ర‌మంలో రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్... రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వెనువెంట‌నే భారీ భ‌ద్ర‌త మ‌ధ్య రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాజాసింగ్‌కు మద్దతుగా భారీగా కోర్టు వద్దకు ఆయన అనుచరులు వచ్చారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లిలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. మరోవైపు రాజాసింగ్ వర్గీయుల ఆందోళన చేయడంతో వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాల నినాదాలతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌

వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొంది. వచ్చే నెల 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది.

ఆ వెంట‌నే బెయిల్‌

అయితే.. రాజాసింగ్ అదే నాంప‌ల్లి కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా రాజా త‌ర‌పున వాద‌నలు వినిపించిన న్యాయ‌వాది.. పిటిష‌న‌ర్‌ను పోలీసులు బ‌ల‌వంతంగా అరెస్టు చేశార‌ని అన్నారు. 41ఏ కింద ముంద‌స్తు నోటీసులు కూడా ఇవ్వ‌లేద‌ని కోర్టుకు తెలిపారు. పిటిష‌న‌ర్ ఒక ప్ర‌జాప్ర‌తినిధి అన్న విష‌యాన్ని పోలీసులు ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌నుల స‌మీక్ష‌లు ఉన్నాయ‌ని.. దీనిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. ఈ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన కోర్టు.. రాజా సింగ్‌కు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.