Begin typing your search above and press return to search.

వాటి కోసం బీజేపీతో ఫైట్ చేస్తా... రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   21 Dec 2020 3:15 AM GMT
వాటి కోసం బీజేపీతో ఫైట్ చేస్తా... రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవధను నిషేధిస్తూ కఠినమైన చట్టాలను ఆచరణలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. బీఫ్ బ్యాన్ ను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ఎన్డీఏ సర్కార్...గోసంరక్షణకు పలు చర్యలు చేపట్టింది. ఇక, యూపీ వంటి రాష్ట్రాల్లో గోవుల సంరక్షణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి మరింత ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోవుల సంరక్షణ కోసం పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు నడుం బిగించారు. ఈ క్రమంలోనే గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ గోవుల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరక్షణ కోసం అవసరమైతే సొంత పార్టీపైనా పోరాడేందుకు సిద్ధమంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. గోవులు తన తల్లిలాంటివని.. గోరక్షణ తన ధర్మమని.. తన కర్తవ్యమని, ప్రతి ఒక్క ఆవును హిందువులు కాపాడుకోవాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందూ ధర్మం.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని, పార్టీనైనా.. పదవినైనా వదులుకునేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

జాతీయ ప్రాణిగా ఆవును ప్రకటించాలని రాజాసింగ్ ఉద్వేగపూరితంగా డిమాండ్ చేశారు. గోమాతల సంరక్షణ కోసం తాను గతంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించానని, అయితే, పార్టీ నాయకులు అందుకు అంగీకరించలేదని రాజాసింగ్ అన్నారు. పార్టీకి ఉన్న ఒక్క శాసనసభ్యుడు రాజీనామా చేస్తే ఎలాగంటూ తనకు పెద్దలు నచ్చచెప్పారని రాజాసింగ్ అన్నారు. గోరక్షణ కోసం ఎంత దూరమైనా వెళతానని, అవసరమైతే సొంతపార్టపైనా పోరాటం చేస్తానని అన్నారు. గోమాతను కాపాడేందుకు తన పదవిని కాళ్ల కింద వేసి తొక్కేస్తానని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ యుగతులసి పౌండేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌లో జరిగిన ‘గోమహాధర్నా’లో పాల్గొన్న రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గోవులను రక్షించి, గో హత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను చేయాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళుతున్న యుగ తులసి ఫౌండేషన్ ఈ ధర్నా చేపట్టింది.