Begin typing your search above and press return to search.

టీజీ : మ‌రో ఆర్ చేరితే ఏమౌతుంది ?

By:  Tupaki Desk   |   3 Aug 2022 9:26 AM GMT
టీజీ : మ‌రో ఆర్ చేరితే ఏమౌతుంది ?
X
తెలంగాణ రాష్ట్రంలో పోలిటిక్స్ శ‌ర‌వేగంగా మారుతున్నాయి. వీలైనంత వ‌ర‌కూ కేసీఆర్ హ‌వాకు చెక్ పెట్టాల‌న్న ఉద్దేశంతో విప‌క్ష పార్టీల‌లో చ‌ల‌నం వ‌స్తోంది. ఆ విధంగా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిణామాల్లో అనూహ్య మార్పు క‌నిపిస్తోంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే, తెలంగాణ కోటీశ్వరుల్లో ఒకరైన కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌న ప‌ద‌వికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏక కాలంలో రాజీనామా చేశారు.

సుదీర్ఘ కాలం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు రేగిన త‌రువాత ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న రేవంత్ ను ఉద్దేశించి చేసిన మాట‌లు లేదా వ్యాఖ్య‌లు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కానీ ఆయ‌న మాట‌ల‌ను తాను ప‌ట్టించుకోబోన‌ని రేవంత్ అంటున్నారు.

తెలంగాణ‌లో కొంద‌రు రెడ్లు బీజేపీ వైపు, ఇంకొందరు కాంగ్రెస్ వైపు ఉంటే టీఆర్ఎస్-కు మేలే క‌దా అన్న భావ‌న కూడా వినిపిస్తుంది. అయినా కూడా ఎవ‌రి దారి వారిదే, ఎవ‌రి తీరు వారిదే అన్న విధంగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. రాజ‌గోపాల్ చేరిక‌తో బీజేపీలో బ‌లం పెరిగింద‌ని బండి సంజయ్ వ‌ర్గం విశ్వసిస్తూ ఉంది. కానీ ఇందుకు సంబంధించి మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది.

వాస్త‌వానికి ఈట‌ల రాజేంద‌ర్ కానీ ర‌ఘునంద‌న్ కానీ టీఆర్ఎస్ ను వ‌ద్దు అని అనుకుని వ‌చ్చిన‌వారే ! అదే స‌మ‌యంలో వారు త‌మ వ్య‌క్తిత్వాన్ని తాక‌ట్టు పెట్టుకోవ‌డం ఇష్టంలేకే ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా ఇక్క‌డికి వ‌చ్చామ‌ని చెబుతూనే, సంబంధిత ఉప ఎన్నిక‌ల్లో దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు అందుకున్నారు. హుజురాబాద్ ఎన్నిక‌లకే ల‌క్ష కోట్ల ఎన్నిక‌లు అన్న పేరు కూడా వ‌చ్చింది.

ఎందుకంటే ద‌ళిత బంధు పేరిట ఆ రోజు ల‌క్ష కోట్ల రూపాయ‌లు విలువ చేసే ప‌థ‌కాన్ని రాత్రికి రాత్రే ఎనౌన్స్ చేసి కేసీఆర్ స‌క్సెస్ అవుదామ‌ని అనుకున్నారు. కానీ ఈట‌ల ప్రభావం ముందు అవ‌న్నీ తేలిపోయాయి. ఆ ఎత్తుగ‌డ‌ల‌న్నీ వీగిపోయాయి.

అదేవిధంగా అంత‌కుముందు దుబ్బాక‌లోనూ ఇదే విధంగా ర‌ఘునంద‌న్ ను దెబ్బ కొట్టాల‌ని సంబంధిత ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌య‌త్నించిన కేసీఆర్ కు ఎదురుదెబ్బే త‌గిలింది. ఇక బీజేపీలో రాజాసింగ్ (ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే) ఉండ‌నే ఉన్నారు. వీరికి తోడు మ‌రో ఆర్ చేరితే ఏ విధంగా ఉంటుంది.

కేసీఆర్ ఏమ‌యినా మునుగోడులో త‌న గులాబీ జెండాను రెప‌రెప‌లాడించే శ‌క్తిని కూడదీసుకోనున్నారా? అన్న ప్ర‌శ్న ఒక‌టి వినిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన సంద‌ర్భంగా త‌న పోరాటం కేసీఆర్ కుటుంబంపైనే అని కోమటిరెడ్డి చెప్పారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కానీ గ‌త కొంత కాలంగా త‌న‌కు చెందిన క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు అన్నీ తీవ్ర న‌ష్టాల‌లో ఉన్నందునే ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకుని, బీజేపీ గూటికి వెళ్లార‌న్న వాద‌న ఒక‌టి సోష‌ల్ మీడియాలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు వినిపిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యాన ఉమ్మ‌డి న‌ల్గొండ‌లో రాజ‌గోపాల్ రెడ్డి రాక ఏ విధంగా బీజేపీ గ‌తిని మారుస్తుందో చూడాలిక‌.