Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: రాజమండ్రి సిటీలో గెలుపెవరిది.?

By:  Tupaki Desk   |   21 March 2019 11:04 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: రాజమండ్రి సిటీలో గెలుపెవరిది.?
X
అసెంబ్లీ నియోజకవర్గం : రాజమండ్రి సిటీ

టీడీపీ : ఆదిరెడ్డి భవానీ
వైసీపీ : రౌతు సూర్యప్రకాష్ రావు
జనసేన : సత్యనారాయణ

రాష్ట్ర రాజకీయాల్లోనే ఖరీదైన సీట్లుగా రాజమండ్రి సీట్లకు పేరుంది. ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ సీటు ఎప్పుడూ హాటే.. దాంతోపాటు రాజమండ్రి అసెంబ్లీ సీట్లకు కూడా భారీ పోటీ ఉంటుంది. ఈ ఎన్నికల వేళ కూడా చంద్రబాబు కొత్త ఎత్తు వేసి ప్రతిపక్షానికి షాక్ ఇచ్చాడు. వైసీపీ మాత్రం సీనియర్ నే నమ్ముకుంది. ఇక జనసేన నుంచి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీగానే పోటీ నెలకొందని చెప్పవచ్చు..అయితే జనసేన అభ్యర్థి ఓట్లు చీల్చే స్థాయిలో ఉన్నారు.

*రాజమండ్రి చరిత్ర

తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా ఈ సీటును టీడీపీ వదులుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ సాయంతో ఆకుల సత్యనారాయణ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత బీజేపీ - టీడీపీ విడిపోయి భద్ద శత్రువులుగా మారాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఎర్రం నాయుడు కూతురును రాజమండ్రి సిటీ బరిలోంచి దించింది. బాగా డబ్బున్న ప్రాంతంగా పేరుబడడంతో ఇక్కడ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతుంటుంది. చాలా కుల - రాజకీయ - సామాజిక సమీకరణాలు ఇక్కడ కీలకంగా ఉంటాయి.

*టీడీపీ కొత్త అభ్యర్థి..

పోయిన సారి ఈ సీటును బీజేపీకి వదిలేయడంతో ఈసారి టీడీపీకి కొత్త అభ్యర్థిని వెతికి కేటాయించింది. ఎర్రం నాయుడు కూతురు - ఆదిరెడ్డి అప్పారావు కోడలు అయిన ఆదిరెడ్డి భవానీకి టీడీపీ టికెట్ ఇచ్చింది. మొదట భవానీ భర్త వాసుకు ఇస్తారని ప్రచారం జరిగినా రాజకీయ వారసత్వం ఉండడం.. బలమైన నేపథ్యం ఉండడంతో భవానీకే బాబు కేటాయించారు. ప్రస్తుతం వెలమ సామాజికవర్గమైన ఈమె బలమైన నేతగా ఉన్నారు. అశేషంగా ఉన్న బీసీ ఓట్లు భవానీకే పడే చాన్స్ ఉందట.. నియోజకవర్గంలో ప్రస్తుతం మిగతా ఇద్దరికంటే భవానీయే బలంగా ఉన్నారని సమాచారం.ఆర్థికంగా కూడా ఈమె బలంగా ఉండడం.. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉండడం విశేషం. గుడా చైర్మన్ గన్నికృష్ణ కూడా టికెట్ కోసం ప్రయత్నించినా చంద్రబాబు భవానీయే గెలుపు గుర్రమని ఆమెకే టికెట్ ఇచ్చాడు.

*వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే

ఇక వైసీపీ నుంచి కూడా బలమైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బొమ్మన రాజకుమార్ పోటీచేశారు. కానీ ఈసారి ఆయనకంటే బలమైన రౌతు సూర్యప్రకాష్ రావుకు వైసీపీ టికెట్ ఇచ్చింది. స్థానిక కార్యకర్తల బలం.. ప్రజల్లో మంచి పేరు - ఫాలోయింగ్ ఉండడం రౌతుకు కలిసివచ్చే అంశాలు.

*జనసేన అభ్యర్థిగా ఫిల్మ్ డిస్ట్రి బ్యూటర్

ఇక జనసేన రాజమండ్రి సిటీపై ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ - అనుశ్రీ ఫిలింస్ అధినేత సత్యనారాయన పోటీ చేస్తున్నారు. ఈయన రాజమండ్రి సిటీలో ఉన్న అశేష కాపు ఓట్లపైనే నమ్మకంగా ఉన్నారు. అయితే కొత్తగా వచ్చిన ఈయనకు కాపు ఓట్లు గంపగుత్తగా పడతాయనుకుంటే పొరపాటేనంటున్నారు.

*గెలుపు ఎవరికి చాన్స్

రాజమండ్రి సిటీలో ద్విముఖ పోరు ప్రధానంగా ఉంది. టీడీపీ - వైసీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. కాకపోతే టీడీపీపై కోపంగా ఉన్న కాపులు వైసీపీవైపు చూస్తున్నారు. అయితే జనసేన అభ్యర్తి కాపు ఓట్లు చీల్చితే మాత్రం వైసీపీకి దెబ్బపడి టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలుంటాయని గ్రౌండ్ రిపోర్టులో తేలింది. కానీ చివరి వరకూ కూడా ఓట్ల చీలిక ప్రధానంగా ఉంటుంది. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు.