Begin typing your search above and press return to search.

రాజమండ్రిలో జనసేన ప్రభావం.. టీడీపీ తేల్చిన నిజం

By:  Tupaki Desk   |   5 May 2019 11:46 AM GMT
రాజమండ్రిలో జనసేన ప్రభావం.. టీడీపీ తేల్చిన నిజం
X
ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. అది టీడీపీ, వైసీపీ గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని తాజాగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలను బట్టి అర్థమవుతోంది. జనసేన ఓట్ల చీలిక ముఖ్యంగా టీడీపీకి నష్టమా..? లేక వైసీపీకి నష్టమా అన్న సంగతిని పోటీచేసిన అభ్యర్థులు కూడా తేల్చకపోవడం గమనార్హం.

రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ ఈసారి అదే సీటుపై పోటీచేయలేదు. ఆయన కోడలు మాగంటి రూప ఈసారి రాజమండ్రి బరిలో టీడీపీ ఎంపీగా పోటీచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షకు హాజరైన మాగంటి రూప ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అనుకున్నదానికన్నా జనసేన ప్రభావం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగానే ఉందని ఆమె స్పష్టం చేశారు.

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో గెలుపు ఓటములపై తాజాగా చంద్రబాబు సమీక్షించారు. ఈ భేటికి రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఎన్నికల పోలింగ్ సరళి చూశాక జనసేన ప్రభావం రాజమండ్రి పార్లమెంట్ లో భారీగానే ఉందని మాగంటి రూప పేర్కొన్నారు. జనసేన పార్టీ ఓట్ల చీలిక ఎవరి గెలుపు అవకాశాలను ఎంతమేరకు దెబ్బతీశాయన్నది అంచనా వేయలేకపోతున్నామన్నారు. అయితే రాజమండ్రి పరిధిలో మెజార్టీ అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుస్తుందన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

అనపర్తిలో 83.9 శాతం అత్యధిక పోలింగ్ నమోదైందని.. రాష్ట్రంలోనే రెండో అత్యధికం ఇది అని.. రాత్రి 1గంట వరకూ క్యూలో ఉండి ఓట్లేశారని.. ఇంత భారీగా పోలింగ్ ఖచ్చితంగా టీడీపీకే అనుకూలమని తాము భావిస్తున్నామని మాగంటి రూప పేర్కొన్నారు. అత్యధిక పోలింగ్ ఖచ్చితంగా టీడీపీకే లాభమని చంద్రబాబు చెప్పినట్టు రూప తెలిపారు.