Begin typing your search above and press return to search.

రాజయ్య ఫ్యామిలీని సీన్ లోకి తెస్తున్నారా?

By:  Tupaki Desk   |   8 Oct 2015 4:40 AM GMT
రాజయ్య ఫ్యామిలీని సీన్ లోకి తెస్తున్నారా?
X
కాస్త అటూఇటూగా తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం కానీ ఓకే అనుకుంటే ఒకే సమయంలో రెండింటిని నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన అసరమే లేదు. వరంగల్ ఎంపీ స్థానంతోపాటు.. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ అసెంబ్లీకి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. వరంగల్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా అధికారపక్షం ఎవరిని రంగంలోకి దించుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ అధికారపక్షానికి సంబంధించి ఇప్పటివరకూ పలు పేర్లు తెరపైకి వచ్చినా.. తాజాగా మాత్రం ఆసక్తికరమైన వాదన ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి నెత్తిన పెట్టుకున్న రాజయ్యను.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వేటేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విపరీతమైన వేదనలో మునిగిపోయినట్లు చెబుతారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వరంగల్ ఉప ఎన్నికల్లో రాజయ్య ఫ్యామిలీని రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన తెలంగాణ అధికారపక్షం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.

రాజయ్య సతీమణి ఫాతిమా మేరీ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో సీనియర్ లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు. ఆమెకు ఎంత జీతం వస్తుంది? ఎంత సర్వీసు ఉందన్న లాంటి విషయాల మీద ఇంటెలిజెన్స్ రహస్యంగా సమాచారం సేకరిస్తున్న వైనం ఈ చర్చకు కారణంగా తెలుస్తోంది. రాజయ్యను తొలగించటం ద్వారా ఆయా వర్గాల్లో తెలంగాణ అధికారపక్షంపై వ్యతిరేకత మొదలైందని.. వరంగల్ ఉప ఎన్నికల్లో సదరు సామాజిక వర్గం కీలకం కానున్న నేపథ్యంలో.. రాజయ్య కుటుంబ సభ్యుల్ని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. రాజయ్య సతీమణితో పాటు.. ఆయన కుమారుడి పేరును పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. అధికారపార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న ఏర్రోళ్ల శ్రీనివాస్.. పిడమర్తి రవి లాంటి వారి సంగతేమిటో..?