Begin typing your search above and press return to search.

'మీటూ'..రాజ్‌ నాథ్ ఆధ్వ‌ర్యంలో 'పీవోఎం'!

By:  Tupaki Desk   |   24 Oct 2018 1:41 PM GMT
మీటూ..రాజ్‌ నాథ్ ఆధ్వ‌ర్యంలో పీవోఎం!
X
ప్ర‌స్తుతం `మీటూ` ఉద్య‌మం దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. సినీరంగం, రాజ‌కీయ రంగం, క్రీడా రంగం, కార్పొరేట్ ఆఫీసులు, ఇలా దాదాపుగా అన్నిరంగాల‌లో లైంగిక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లు త‌మకు ఎదురైన చేదు అనుభ‌వాల్ని వెల్ల‌డిస్తున్నారు. ఈ నేపథ్యంలో `మీటూ`ఉద్య‌మంపై కేంద్ర ప్ర‌భుత్వం సీనియర్ న్యాయవాదులు, న్యాయ‌ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. `మీటూ`ద్వారా వ‌చ్చిన ఫిర్యాదుల‌పై న‌లుగురు స‌భ్యుల‌తో ఏర్పాటు చేయ‌బోతున్న క‌మిటీ విచార‌ణ జ‌రుపుతుంద‌ని కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేన‌కా గాంధీ కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. తాజాగా `మీటూ`కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను కేంద్రం ఏర్పాటు చేసింది.

కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత విధానాల‌ను బలోపేతం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ - మహిళా - శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీలు ఈ జీవోఎంలో సభ్యులుగా ఉంటారు. అన్నిరంగాల్లోని మహిళలు వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని మేనకా గాంధీ తెలిపారు. నిర్దిష్ట సమయం అని లేకుండా ఎప్పుడైనా బాధితులు ఫిర్యాదు చేయవ‌చ్చ‌ని ఆమె తెలిపారు. ఆ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్ లను బలోపేతం చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. లైంగిక వేధింపులను నిరోధించేందుకు, కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేయ‌నుంది. మహిళల భద్రతకు అమ‌లులో ఉన్న నిబంధనలను పరిశీలించి, త‌దుప‌రి చర్యలను 3 నెల‌ల్లోపు జీవోఎం సిఫార‌సు చేయ‌నుంది.