Begin typing your search above and press return to search.
పార్టీ ఏర్పాటుకు రజనీ సన్నాహాలు
By: Tupaki Desk | 29 Aug 2020 4:15 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ పార్టీ స్థాపనకు సన్నాహాలు మొదలవుతున్నాయి. తమిళనాడులో మరో ఎనిమిది నెలల్లోనే శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక రజనీ కాంత్ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని గత 20 ఏళ్లుగా తమిళనాడు ప్రజలు కోరుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆయన రాజకీయాల్లో వస్తాడని అనుకున్నా.. ఆయన సినిమాలకే పరిమితం అయ్యాడు. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత ఏడాది ప్రకటించారు. సొంతంగా పార్టీ పెట్టనున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో వరుసగా ఆయన పలు సినిమాల్లో నటించారు. పార్టీ పేరు ప్రకటించడం, సంస్థాగత నిర్మాణం చేపట్టలేదు. ఇక ఎన్నికలకు 8 నెలలే సమయం ఉన్న నేపథ్యంలో తొందర్లోనే ఆయన పార్టీ పెడతారని సమాచారం. ఇప్పటికే ఆయన రజని మక్కల్ మండ్రం ఏర్పాటు చేసి దానికి జిల్లా స్థాయిలో కార్యదర్శులను నియమించి ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. త్వరలో రజనీకాంత్ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. పార్టీ ఏర్పాటుపై వారి అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తమిళనాడులో మరో స్టార్ హీరో కమలహాసన్ 'మక్కల్ నీది మయ్యం ' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోయి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో మిత్రులకు, రాజకీయ పార్టీ నాయకులను ఆయన సంపాదిస్తూ పార్టీ ఏర్పాటుపై కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. 2021 లో జరిగే సాధారణ ఎన్నికల్లో రజనీకాంత్ సొంత పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలుపుతారని ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. పార్టీని ఏర్పాటు చేసేందుకే ఆయన మండ్రం నిర్వాహకులతో సెప్టెంబర్ రెండో వారంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.