Begin typing your search above and press return to search.

ఈయన ప్ర‌ధాని ప‌ద‌వి మూణ్ణాళ్ల ముచ్చ‌టే

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:16 AM GMT
ఈయన ప్ర‌ధాని ప‌ద‌వి మూణ్ణాళ్ల ముచ్చ‌టే
X
భార‌త్ పొరుగుదేశమైన శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సే ప‌ద‌వి మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గా మిగిలిపోయింది. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన వివాదాస్పద రీతిలో నియమించిన ప్రధానమంత్రి మహీంద రాజపక్సే పార్లమెంట్ విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీలంక పార్లమెంట్ బుధవారం అవిశ్వాస తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. దీంతో రాజపక్సే ప్రధాని పదవి నుంచి వైదొలగడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. కేవలం 20 రోజుల్లోనే ఆయన గద్దె దిగిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయంపై మంగళవారం సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బలపరీక్ష కోసం బుధవారం పార్లమెంట్ సమావేశమైంది. విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలిగించిన అక్టోబర్ 26 తర్వాత పార్లమెంట్ సమావేశం కావడం ఇదే తొలిసారి. రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 225 మంది సభ్యులు కలిగిన సభ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిందని తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్ జయసూర్య ప్రకటించారు. 122 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలిపారని వెల్లడించారు. సభ్యుల మూజువాణి ఓటు ప్రకారం ప్రభుత్వానికి మెజార్టీ లేదని ధ్రువీకరిస్తున్నాను అని జయసూర్య తెలిపారు. ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోవడం ద్వారా అధ్యక్షుడు సిరిసేనకు భారీ ఎదురుదెబ్బ తగలగా.. పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘేకు ఊరట లభించింది. కాగా అవిశ్వాస తీర్మానాన్ని వామపక్ష పార్టీ అయిన జనతా విముక్తి పేరమునా నాయకుడు అనురా కుమార దిసనాయక మొదట ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనకు తమిళ జాతీయ కూటమితోపాటు చిన్న చిన్న ముస్లిం పార్టీలు మద్దతు పలికాయి. రాజపక్సే ప్రభుత్వంలో కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురు క్యాబినెట్ మంత్రులు - ఓ సహాయ మంత్రి కూడా ప్రతిపక్షాలకే అండగా నిలువడం విశేషం. మరోవైపు రాజపక్సే మద్దతుదారులు సభలో తీవ్ర గందరగోళం సృష్టిస్తూ.. అవిశ్వాసాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. సభను గురువారానికి వాయిదా వేసిన స్పీకర్ జయసూర్య.. తదుపరి రాజ్యాంగ ప్రక్రియను చేపట్టాలని అధ్యక్షుడు సిరిసేనకు లేఖరాశారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 122 మంది చట్టసభ సభ్యుల సంతకాలను అధ్యక్షుడికి పంపారు. అవిశ్వాస తీర్మానం తర్వాత పదవీచ్యుత ప్రధానమంత్రి విక్రమసింఘే మాట్లాడుతూ తన ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించబడిందని ప్రకటించారు. అక్టోబర్ 26కు ముందు ఉన్న ప్రభుత్వమే కొనసాగేలా మేం చర్యలు చేపడుతున్నాం. అక్రమంగా ఏర్పడిన ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను పాటించవద్దని ప్రభుత్వ అధికారులు - పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైంది అని పేర్కొన్నారు.