Begin typing your search above and press return to search.

సామాన్నుడ్ని చిత‌కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

By:  Tupaki Desk   |   1 July 2018 10:26 AM GMT
సామాన్నుడ్ని చిత‌కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు
X
అస‌లే ప్ర‌తికూల వాతావ‌ర‌ణం. మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న వేళ‌.. రాజ‌స్థాన్ బీజేపీకి మ‌రో కొత్త త‌ల‌నొప్పి చుట్టుకుంది. చేతిలోని ప‌వ‌ర్ ను ఇష్టారాజ్యంగా వాడేస్తున్న బీజేపీ నేత‌ల తీరుపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇవి స‌రిపోన‌ట్లు అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు న‌డిరోడ్డు మీద వేసిన వీరంగం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఓవ‌ర్ టేక్ చేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్న కోపంతో ఒక వాహ‌న‌దారుడి మీద ఎమ్మెల్యే కొడుకు జ‌రిపిన దాడికి సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. రాజ‌స్తాన్ లోని బ‌న్స్ వారా బీజేపీ ఎమ్మెల్యే ధ‌న సింగ్ రావ‌త్ కొడుకు రాజా త‌న ఎస్ యూవీ వాహ‌నంలో వెళుతున్నాడు.

అయితే.. అత‌డి కారు ముందు వెళుతున్న కారు డ్రైవ‌ర్ దారి ఇవ్వ‌లేదు. క‌ష్ట‌ప‌డి కారును ఓవ‌ర్ టేక్ చేసి రోడ్డు మీద త‌న ఎస్ వీయూని ఆపేసి.. తీవ్ర ఆవేశంతో ఊగిపోయాడు. కారులో నుంచి డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు ఈడ్చి కొట్ట‌టం మొద‌లెట్టారు. అక్క‌డితో ఆగ‌క‌.. ఎమ్మెల్యే కొడుకు స్నేహితులు సైతం మారుతి కారు డ్రైవ‌ర్ ను న‌డిరోడ్డు మీద కొట్ట‌టం మొద‌లెట్టారు. త‌న కారు వెళ్ల‌కుండా ఆపుతావా? నీకెంత ధైర్య‌మంటూ ఎమ్మెల్యే కొడుకు విరుచుకుప‌డ్డారు. ఈ ఉదంతాన్ని కొంద‌రు వీడియో తీశారు.దాదాపు నెల రోజుల అనంత‌రం దాడికి చెందిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోతో బాధితుడి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఎమ్మెల్యే కొడుకు చేతిలో దాడికి గురైన వ్య‌క్తిని నీర‌వ్ గా గుర్తించారు. అత‌నో ఉపాధ్యాకుడిగా గుర్తించారు. దీనిపై అత‌ను స్పందిస్తూ.. బ‌న్స్ వారాలో వ‌న్ వే రోడ్డు మీద త‌న కారులో వెళుతున్నాన‌ని.. ఓవ‌ర్ టేక్ చేసే ప్ర‌య‌త్నం చేసినా.. అందుకు అవ‌కాశం లేక‌పోవ‌టంతో ఎమ్మెల్యే కొడుకు త‌న‌పై గొడ‌వ చేసిన‌ట్లుగా చెప్పారు.

మ‌రి.. జ‌రిగిన దాడిపై ఫిర్యాదు చేయ‌రా? అంటే.. తాను ఎవ‌రి మీదా ఎలాంటి ఫిర్యాదు చేయాల‌ని అనుకోవ‌టం లేద‌ని స‌ద‌రు బాధితుడి వ్యాఖ్యానించారు. భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలోనే స‌ద‌రు బాధితుడి ఫిర్యాదు చేయ‌టం లేదంటున్నారు. మ‌రోవైపు ఈ విష‌యంపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. బాధితులు ఎవ‌రూత‌మ‌కు ఫిర్యాదు చేయ‌లేద‌ని.. తాము ఏమీ చేయ‌లేమ‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఈ ఉదంతంపై ప‌లువురు మండి ప‌డుతున్నారు.బీజేపీ నేత‌ల‌కు అధికారం త‌ల‌కెక్కింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.