Begin typing your search above and press return to search.

స‌ర్కారు ఆర్డ‌ర్: ఆఫీసుకు నో జీన్స్!

By:  Tupaki Desk   |   27 Jun 2018 3:17 PM GMT
స‌ర్కారు ఆర్డ‌ర్: ఆఫీసుకు నో జీన్స్!
X
రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ సంస్థలు - కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై ఆ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఆదేశంపై స‌ర్కారు ఉద్యోగులు ఫైర్ అయేందుకు కార‌ణం ఏంటంటే...జీన్స్, టీషర్టులతో ఆఫీసుకు రాకూడ‌ద‌ట‌. దీంతోపాటుగా కురచ దుస్తులు వేసుకోవ‌ద్ద‌ని అధికారులు ఆదేశించారు. రాజస్థాన్ లేబర్ డిపార్ట్‌మెంట్ తమ ఉద్యోగులకు ఈ ఆదేశాలు జారీచేసింది.

డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలతో కూడిన సర్క్యులర్‌ను ఈనెల 21న లేబర్ కమిషనర్ గిరిరాజ్ సింగ్ కుష్వాహా జారీ చేశారు. ``కొంతమంది అధికారులు/ఉద్యోగులు.. జీన్స్, టీషర్టులు, కొన్ని అసభ్యకరమైన డ్రెస్సులు ధరించి విధులకు వస్తున్నారు. అది ఆఫీస్ గౌరవానికి భంగం కలిగించేలా, ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఉంది`అని అందులో పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులంతా డిపార్ట్‌ మెంట్ - ఆఫీసులకు ప్యాంట్లు - షర్టులు ధరించి కార్యాలయాల గౌరవాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామని వివరించారు. గతంలో కూడా ఉద్యోగుల వేషధారణకు సంబంధించి ఇలాంటి సర్య్యులర్‌ను జారీ చేశార‌ట‌.

కమిషనర్ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కమిషనర్ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ రాజస్థాన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గజేంద్ర సింగ్ తెలిపారు. సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. మ‌రోవైపు క‌మిష‌న‌ర్ మాత్రం త‌న ఆదేశాల‌ను స‌మ‌ర్థించుకుంటున్నారు. ఏ ఒక్క ఉద్యోగి నుంచి ఇప్పటి వరకు ఫీడ్‌బ్యాక్ రాలేదని కమిషనర్ తెలిపారు.