Begin typing your search above and press return to search.

అక్క‌డ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే..?

By:  Tupaki Desk   |   8 Jan 2016 12:58 PM GMT
అక్క‌డ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే..?
X
చ‌ట్టాలు ఎన్ని ఉన్నా.. వాటిని పాటించే వారు త‌క్కువే. కేవ‌లం నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్రాణాలు పోగొట్టుకునే వారు ప్ర‌తి ఏటా వేలాదిగా ఉన్నారు. ఆ మ‌ధ్య వ‌చ్చిన సినిమాలో మ‌హేశ్ బాబు డైలాగ్ ఒక‌టి ఉంటుంది. ఈ శ‌తాబ్దంలో క‌నుక్కొన్న అతి ద‌రిద్ర‌పు వ‌స్తువు ఏదైనా ఉందంటే అది సెల్ ఫోన్ అని చెబుతాడు. కొన్ని సంద‌ర్భాల్లో ఈ మాట నిజ‌మ‌నిపిస్తుంది. సెల్ రాక‌తో జీవ‌న‌శైలి మొత్తంగా మారిపోయింది. దాని వ‌ల్ల ఎంత సౌక‌ర్యం ఉందో.. అంతే అసౌక‌ర్యం ఉన్న మాట వాస్త‌వం.సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌టం కార‌ణంగా పెద్ద ఎత్తున ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. దీనిపై భారీ జ‌రిమానాలు విధించినా మార్పు రాని దుస్థితి.

తాజాగా ఇలాంటి వైఖ‌రిని మార్చేందుకు రాజ‌స్థాన్ రాష్ట్ర స‌ర్కారు వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడా రాష్ట్రంలో సెల్‌ ఫోన్ మాట్లాడుతూ వాహ‌నం న‌డుపుతున్న‌ట్లు పోలీసుల కంట‌ప‌డితే ఇక ప‌ని అయిపోయిన‌ట్లే. భారీ జ‌రిమానాతో పాటు.. సెల్ ఫోన్ ను తీసేసుకోనున్నారు. రోడ్డు భ‌ద్ర‌తా వారోత్స‌వాల్లో భాగంగా తాజా నిర్ణ‌యాన్ని రాజ‌స్థాన్ రాష్ట్ర స‌ర్కారు తీసుకుంది. సెల్ మాట్లాడుతూ వాహ‌నాలు న‌డిపేవారి విష‌యంలో క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. ఇందులో భాగంగానే తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆ రాష్ట్ర మంత్రి గులాబ్ చంద్ క‌టారియా చెబుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గించాలంటే ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌వ‌ని చెప్ప‌టం బాగానే ఉన్నా.. అవినీతికి అల‌వాటు ప‌డిన అధికారుల‌తో ఖ‌రీదైన ఫోన్ల‌ను పోగొట్టుకోకుండా ఉండేందుకు చేయి త‌డ‌ప‌టం ఇక‌పై మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

ఏమైనా.. ఇలాంటి నిర్ణ‌యం తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తీసుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఖ‌రీదైన సెల్ పోన్ ప్ర‌భుత్వం పాలు కాకుండా ఉండేందుకు డ్రైవింగ్ చేసే స‌మ‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండే అవ‌కాశం ఈ నిర్ణ‌యంతో సాధ్య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. రోడ్డు ప్ర‌మాదాల‌కు చెక్ చెప్పేందుకు అంత‌కు మించి కావాల్సిందేముంది?