Begin typing your search above and press return to search.

16 సెక‌న్ల ఫోన్ కాల్ ఆ ప్ర‌ముఖుడ్ని జైలుపాలు చేసింద‌ట‌!

By:  Tupaki Desk   |   4 April 2019 4:54 AM GMT
16 సెక‌న్ల ఫోన్ కాల్ ఆ ప్ర‌ముఖుడ్ని జైలుపాలు చేసింద‌ట‌!
X
అంత‌ర్జాతీయ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ గా.. గోల్డ్ మ‌న్ సాచ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్ట‌రుగా.. హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్.. నార్త్ వెస్ట్ర‌న్ వ‌ర్సిటీకి చెందిన కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యుడిగా ఉండ‌టం.. హైద‌రాబాద్ ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బోర్డు ఛైర్మ‌న్ .. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయ‌న చేప‌ట్టిన ప‌దవుల గురించి చెబితే రెండు.. మూడు పేజీలు నిండిపోతాయి. అలాంటి వ్య‌క్తి జీవితాన్ని 16 సెక‌న్ల ఫోన్ కాల్ మార్చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న మీద చెర‌గ‌ని మ‌చ్చ‌ను పడేలా చేసింది. చివ‌ర‌కు జైల్లో గ‌డ‌పాల్సిన ప‌రిస్థితిని తీసుకొచ్చింది.

ప్ర‌స్తుతం ఐక్య‌రాజ్య‌ స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కు నిర్వ‌హ‌ణ సంస్క‌ర‌ణల ప్ర‌త్యేక స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న ఎవ‌రో కాదు.. ర‌జ‌త్ గుప్తా. నింగిలో ఉన్న ఆయ‌న కెరీర్ ను అథఃపాతాళంలోకి నెట్టేయ‌ట‌మే కాదు.. ఆయ‌న ఎంత చెప్పుకున్నా.. దోషిగా కోర్టు నిర్దారించిన వ్య‌క్తిగా మార్చింది.

మెకిన్సే అండ్ కంపెనీ ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌లో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావ‌టం.. అవి నిరూపిత‌మైన‌ట్లు కోర్టు పేర్కొని ఆయ‌న‌కు జైలుశిక్ష‌ను విధించారు. ఆయ‌న‌కు జైలుశిక్ష ఖ‌రారు చేయ‌టానికి ఆయ‌న మాట్లాడిన ఫోన్ కాల్ ను ఆధారంగా చేసుకున్న అమెరిక‌న్ కోర్టులు ఆయ‌న‌కు శిక్ష విధించాయి.

గోల్డ్‌ మ్యాన్‌ శాక్స్‌ లో ఇన్వెస్ట్‌ మెంట్‌ గురు అయిన వారెన్‌ బఫెట్‌ కు చెందిన బెర్క్‌ షైర్‌ హాత్‌వే పెట్టుబడి పెట్టే విషయాన్ని ముందుగా ఆయన హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ అయిన రాజరత్నంకు తెలియజేశారన్న‌ది ఆయ‌న‌పై ఆరోప‌ణ‌. గోల్డ్‌ మ్యాన్‌ శాక్స్‌ బోర్డు సమావేశం నుంచి బయటకు వచ్చి ఫోన్‌ లో ఆయనతో 16 సెకన్లు మాట్లాడారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల్లో రజత్‌ గుప్తాకు శిక్ష ఖరారు చేయటానికి ఈ ఫోన్‌ కాల్‌ను న్యాయస్థానం ప్రధాన ఆధారంగా పరిగణలోకి తీసుకుంది. తాను ఎలాంటి ముఖ్యమైన సమాచారాన్ని రాజరత్నంకు చెప్పలేదు. వేరే విషయంలో సమాచారం కోసం నేను నా సెక్రటరీ ద్వారా ఫోన్‌ లో ఆయనతో మాట్లాడాను. అయినా నేను మాట్లాడింది 16 సెకన్లే... ఆ కొద్ది సమయంలో ఏ సమాచారాన్ని చేరవేయగలమ‌న్న‌ది ర‌జ‌త్ గుప్తా వాద‌న.

అమెరికా న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఎన్నో లోపాలు ఉన్నాయ‌ని.. వాటి ఫ‌లితంగా తాను ఎంతో న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని విచారం వ్య‌క్తం చేసిన ఆయ‌న తాజాగా హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు. తాను రాసిన మైండ్ వితౌట్ ఫియ‌ర్ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం వ‌చ్చిన ఆయ‌న ఒక మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన విశేషాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌ని చెప్పాలి.

ఆయ‌నేం చెప్పారంటే..

+ ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో ప్రాసిక్యూషన్‌ ఆరోపణలు - న్యాయస్థానంలో విచారణ జరిగిన తీరు - సంబంధిత వర్గాల వాదనలు మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ నేను ఏం చేశాను - నా వాదన ఏమిటి? అనేది పూర్తిగా బయటకు తెలీదు.

+ అమెరికాలోని న్యాయవ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. దాని ఫలితంగా నేనెంతో ఎంతగానో నష్టపోవలసి వచ్చింది. ఈ ఉదంతంపై నా వాదన - ఆలోచన - అభిప్రాయాలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను.

+ నా జీవితం ఏమిటి?, నేను నిర్ణయాలు ఎలా తీసుకున్నాను - ఎక్కడ తేడా వచ్చింది... అనే విషయాలు చెప్పాలనుకున్నాను. కొత్త తరం - ముఖ్యంగా కార్పొరేట్‌ రంగంలో పైకి రావాలనుకుంటున్న యువతరానికి నా అనుభవాలు - ఆలోచనలు పనికి వస్తాయని అనుకుంటున్నాను. వారికి కొంచెమైనా ఈ పుస్తకం ఉపయోగపడితే సంతోషిస్తాను.

+ నా మీద అన్నీ అసత్య ఆరోపణలు చేశారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడాలంటే - ఇంతకంటే పెద్ద అవకాశాలే నాకు వచ్చాయి. జిల్లెట్‌ - పీఅండ్‌ జీ (ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబ‌ల్ అదేనండి ఎరియ‌ల్ వాషింగ్ పౌడ‌ర్ ఉందిగా ఆ కంపెనీ) విలీనం సందర్భంలో... ఆ సంస్థ సీఈఓకు నేను సలహాదారుడిగా ఉన్నాను. దాదాపు 60 బిలియన్‌ డాలర్ల డీల్‌ అది. ఆ సమాచారం ఎంతో ముందుగా నాకు తెలుసు.

+ + నిజంగా నేనేదైనా చేయగలిగితే ఇంత‌కుమించిన పెద్ద అవకాశం ఎవరికి వస్తుంది? ఇలాంటి ఎన్నో సందర్భాలు నా కెరీర్‌ లో ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉండేది. కానీ నేనెప్పుడూ ఏమీ చేయలేదే? గోల్డ్‌ మ్యాన్‌ శాక్స్‌ విషయంలో చేస్తానా? అయినా అసలు నేనెప్పుడూ ట్రేడింగ్‌ చేసిందే లేదు.