Begin typing your search above and press return to search.

ఎవరీ రజత్ పటీదార్..? వేలంలో కొనకున్నా.. బెంగళూరుకు భలే దొరికాడే..

By:  Tupaki Desk   |   26 May 2022 9:30 AM GMT
ఎవరీ రజత్ పటీదార్..? వేలంలో కొనకున్నా.. బెంగళూరుకు భలే దొరికాడే..
X
కెప్టెన్ డుప్లెసిస్ డకౌటయ్యాడు. విరాట్ కోహ్లి (25) నిరాశపర్చాడు. కానీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అతడు ఆదుకున్నాడు. అలాఇలా కాదు.. ఏకంగా సెంచరీ బాదేసి ఎలిమినేటర్ నుంచి గట్టెక్కించాడు. అతడే రజత్ పటీదార్. 54 బంతుల్లోనే 111 పరుగులు చేసిన రజత్ బెంగళూరు స్కోరును 200 దాటించాడు. అసలింతకీ ఎవరీ పటీదార్..? మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన 29 ఏళ్ల రజత్ పటీదార్ రంజీల్లో ఆ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. 39 ఏళ్ల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 67 ఇన్నింగ్స్ లు ఆడిన రజత్.. 2,588 పరుగులు చేశాడు. సగటు 40.43. ఇక 43 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 42 ఇన్నింగ్స్ లాడి 1,397 పరుగులు సాధించాడు. సగటు 34.07. మరోవైపు 38 టి20ల్లో 37 ఇన్నింగ్స్ లాడి 1,136 పరుగులు చేశాడు. సగటు 34.42.

ఇతడినీ వేలంలో కొనలేదు..అచ్చం గుజరాత్ జట్టులో డేవిడ్ మిల్లర్ లాగే బెంగళూరు కూడా ముందు రజత్ ను వేలంలో కొనుగోలు చేయలేదు. అయితే, మరొక ఆటగాడు అందుబాటులో లేని నేపథ్యంలో రజత్ ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా నిర్ణయమే ఎలిమినేటర్ లో బెంగళూరును కాపాడింది. అయితే, రజత్ ను బెంగళూరు కేవలం బ్యాకప్ ప్లేయర్ గానే భావించింది. లీగ్ లో ఆడించడం కూడా అలానే ఆడించింది. కానీ, తానెంత విలువైన ఆటగాడో అతడు నిన్నటి లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో చాటాడు.

అచ్చం 2012లో బిస్లా లాగే..పదేళ్ల కిందట.. అంటే 2012 ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మన్విందర్ బిస్లా ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేసిన బిస్లా నాడు చెన్నై సూపర్ కింగ్స్ పై కోల్ కతా టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. సరిగ్గా అలాంటి ఇన్నింగ్సే నిన్న రజత్ (54 బంతుల్లో 112 నాటౌట్, 7 సిక్స్లులు, 12 ఫోర్లు) ఆడాడని విశ్లేషకులు పోల్చుతున్నారు.

ఎక్కడా 200 స్ట్రయిక్ రేట్ తగ్గలే..నిన్నటి మ్యాచ్ లో తొలి ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ మొదటినుంచి బాదుడే మంత్రంగా ఆడాడు. ఈ క్రమంలో అతడు ఎక్కడా స్ట్రయిక్ రేట్ 200కు తగ్గకుండా ఆడాడు. మధ్యమధ్యలో కాస్త వెనుకబడ్డా మళ్లీ రెచ్చిపోయి బాదేశాడు.

మరోవైపు 15 ఐపీఎల్ సీజన్లలో సెంచరీ సాధించిన 5వ అన్ క్యాప్డ్ ప్లేయర్ గానూ నిలిచాడు. 2008లో షాన్ మార్స్, 2009లో మనీశ్ పాండే, 2011లో పాల్ వాల్తాటి, 2021లో దేవదత్ పడిక్కల్, 2022లో రజత్ పటీదార్ ఈ ఘనతను సాధించారు.

అంతా అలా కలిసిరావాలి వాస్తవానికి ఈ ఏడాది రంజీల్లో.. అంటే ఐపీఎల్ కు ముందు రజత్ మంచి ప్రదర్శనే కనబర్చాడు. సౌరాష్ట్రపై భారీ సెంచరీ (142) చేశాడు. కానీ, అతడిని తొలి నెల రోజుల పాటు ఆడించనే లేదు. చివరకు ప్లేయర్ల కొరతతో బరిలో దించాల్సి వచ్చింది. అప్పటికీ రెండో మ్యాచ్ లోనే రజత్ గుజరాత్ పై అర్ధ సెంచరీ సాధించాడు. హైదరాబాద్ పై 48 పరుగులు చేశాడు. మొత్తమ్మీద ఈ సీజన్ లో బెంగళూరుకు రజత్ ఆడింది ఎలిమినేటర్ తో కలిపి ఏడు మ్యాచ్ లే కావడం గమనార్హం. అయినా ఏం..? ఎలిమినేటర్ లో అతడే ఆపద్బాంధవుడయ్యాడు.