Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రుల‌కు క్వ‌శ్చ‌న్స్ వేస్తే కోప‌మొస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   3 Jun 2018 10:15 AM GMT
ముఖ్య‌మంత్రుల‌కు క్వ‌శ్చ‌న్స్ వేస్తే కోప‌మొస్తోంద‌ట‌
X
రాజ్‌ దీప్ స‌ర్దేశాయ్‌... మోడీ ఫ్యాన్స్‌కి అస్స‌లు న‌చ్చ‌ని జ‌ర్న‌లిస్టు. అత‌నిపై వారికి ప్ర‌తిప‌క్షాల మీద కంటే ఎక్కువ కోపం ఉంది. ఇటీవ‌ల ఓ టెకీ బెంగుళూరులో రాజ్‌ దీప్‌ ను భోంజేస్తున్న టైంలో దేశ ద్రోహి అంటూ తిట్టాడు. విమ‌ర్శించ‌డానికి ఎవ‌రికైనా ఈ దేశంలో హ‌క్కులుంటాయి. కానీ దానికి ఓ ప‌ద్ద‌తి ఉంటుంది. మాట్లాడే హ‌క్కు కంటే వ్య‌క్తిగ‌త ప‌రువు ఇంకా పెద్ద హ‌క్కు. ఇలా ఎన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా రాజ్‌ దీప్ శైలిలో ఏ మాత్రం మార్పులేదు. అదంతా వేరే సంగ‌తి. ఈరోజు ఆయ‌న హైద‌రాబాదుకు వ‌చ్చారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ 53వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన ‘మీడియా ఇన్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ ఎరా’ అనే అంశంపై మాట్లాడారు.

ఇటీవ‌ల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సంప్ర‌దాయాన్ని మానేశార‌ని అన్నారు. అదేంటంటే... గ‌త త‌రం ముఖ్య‌మంత్రులు మీడియాతో ద‌గ్గ‌ర‌గా మెలిగేవారని, విమ‌ర్శ‌లు స్వీక‌రించే వార‌ని... కానీ ఈనాటి సీఎంలు ప్రెస్‌ మీట్‌ లు పెట్టట్లేదని - మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని ఇండియా టుడే కన్సల్టింగ్‌ గ్రూపు ఎడిటర్ ఉన్న వ్యాఖ్యానించ‌డం ఆలోచించాల్సిన విష‌య‌మే. నిజ‌మే అలాంటి ఇంట‌ర్వ్యూలు ఈ మ‌ధ్య త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అయితే, తెలుగు ముఖ్య‌మంత్రులు మాత్రం దేశంలో కొంత మెరుగ‌నే చెప్పాలి. మీడియా స‌మావేశాలు పెడుతున్నారు. కాక‌పోతే అన్నిసార్లు మీడియా వేసే ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోవ‌డం లేదు. మ‌రో కోణం ఏంటంటే... తెలుగు జ‌ర్న‌లిస్టులు మంత్రుల‌ను, సీఎంల‌ను ధైర్యంగా ప్ర‌శ్నించ‌డం మానేశారు.

ఈ సంద‌ర్భంగా రాజ్‌దీప్ ప‌లు మీడియా విష‌యాల‌ను కూడా చ‌ర్చించారు. హైదరాబాద్ ఎంతో మంది గొప్ప పాత్రికేయులను ఇచ్చిందని, ఇక్కడికి రావడం తనకు గర్వంగా ఉందన్నారు. మీడియా కూడా మునుప‌టిలా లేద‌న్నారు. ప్రస్తుతం మీడియాను ప్ర‌క‌ట‌న‌ల విభాగం డామినేట్ చేస్తోంద‌ని, వారి మాటే శాస‌నం అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అందుకే మీడియా సంచలనాల కోసమే చూస్తోంద‌ని - విద్య - వైద్యం - వ్యవసాయం వంటి అంశాలు ప్రాధాన్యం కోల్పోయాయ‌న్నారు. సోషల్‌ మీడియా వ‌ల్ల ప్ర‌తి పౌరుడిలో జ‌ర్న‌లిస్టు క‌నిపిస్తున్నాడ‌ని, దీని వ‌ల్ల క‌లుగుతున్న ముప్పు ఏంటంటే... అసత్య వార్తలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.