Begin typing your search above and press return to search.

రైల్వే జోన్ విషయంలోనే ఏపీకి షాకే

By:  Tupaki Desk   |   7 Aug 2016 5:29 AM GMT
రైల్వే జోన్ విషయంలోనే ఏపీకి షాకే
X
ఏపీ మీద మోడీ సర్కారు పగ పట్టిందా? అన్నట్లుగా ఉంది ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే. ప్రత్యేక హోదా ఇష్యూలో ఇప్పటికే మోడీ సర్కారు ఎంత మొండిగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెన్ని మాటలన్నా.. ఎవరెంత ఒత్తిడి తీసుకొచ్చినా ఏపీకి హోదా ఇచ్చే విషయంలో ప్రధాని మోడీ ఏ మాత్రం సానుకూలంగా లేరన్న విషయం స్పష్టమవుతుందన్న సంగతి తెలిసిందే.

విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు.. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ హామీని ఏపీకి ఇచ్చిన విషయం తెలిసిందే. హోదా అంశం చట్టంలో లేదని చెప్పి తప్పించుకునే మోడీ సర్కారు.. చట్టంలో ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ విషయంలోనూ ఏపీకి హ్యాండ్ ఇచ్చేలా వ్యవహరిస్తుండటం గమనార్హం. మొన్నటికి మొన్న రాజ్యసభలో హోదా అంశంపై కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఈ నేపథ్యంలో రైల్వే ప్రత్యేక జోన్ విషయంలో ఆయన సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటారని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్యసభలో ఎంపీ నరేంద్రకుమార్ స్వైన్ ఒక ప్రశ్నను సంధించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి వాల్తేరు డివిజన్ ను విడదీస్తున్నారా? ఒకవేళ అవును అయితే.. ప్రస్తుతం అది ఏ స్థితిలో ఉంది? అంటూ ప్రశ్నించారు. దీనికిసమాధానం చెప్పిన రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గొహైన్.. ప్రస్తుతానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే విభజన ప్రతిపాదన ఏదీ లేదని లిఖితపూర్వకంగా ఇచ్చేసిన నేపథ్యంలో రైల్వే జోన్ విషయంలోనూ ఏపీకి మోడీ సర్కారు హ్యాండ్ ఇచ్చేసినట్లు స్పష్టమవుతున్నట్లే.