Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే మంత్రినని ఫీలవుతున్నారా?

By:  Tupaki Desk   |   29 March 2016 5:57 AM GMT
ఆ ఎమ్మెల్యే మంత్రినని ఫీలవుతున్నారా?
X
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వ్యవహరం అధికారపక్ష సభ్యులకు ఇబ్బందికరంగా.. విపక్షాలకు సరదాగా అనిపించింది. చివరకు అధికారపార్టీ సభ్యుడి తీరును సున్నితంగా తప్పుపడుతూ స్పీకర్ సైతం చురకలు వేయటం కనిపించింది. తెలంగాణ అధికార పార్టీకి చెందిన రాజేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో చర్చలో భాగంగా ఆరోగ్యశాఖ అంశాలపై మాట్లాడారు.

చేతికి మైకు రావటంతో ఉత్సాహాన్ని ప్రదర్శించిన రాజేందర్ రెడ్డి.. ఆరోగ్య రంగంలో తెలంగాణ సర్కారు ఏమేం చేస్తుందో చెప్పుకుంటూ పోయారు. దాదాపుగా పది నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. నాన్ స్టాప్ గా మాట్లాడుతున్న ఆయన మాటల్ని మధ్యలో ఆపుతూ స్పీకర్ మధుసూధనాచారి ఇక ముగించాలని అనటం.. దానికి బదులుగా ఎమ్మెల్యే తానింకా తన ప్రసంగాన్ని షురూ చేయలేదని చెప్పారు.

ఆయన ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి మాదిరి అంకెలతో సహా చేస్తున్న ప్రసంగంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్ మరోసారి కల్పించుకొని.. అవన్నీ మంత్రిగారు తన సమాదానంలో చెబుతారు.. మీకెందుకు? అంటూ మెత్తగా మందలించాల్సి వచ్చింది. అయినప్పటికీ తన జోరుకు రాజేందర్ రెడ్డి బ్రేకులు వేయలేదు. చివర్లో.. మీ సందేహాలన్నింటిని సమాధానం చెప్పినట్లే అనుకుంటున్నా.. ఇక ఏమీ లేవనే అనుకుంటున్నా.. మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి.. తీసుకుంటామంటూ తన ప్రసంగాన్ని ఎమ్మెల్యే పూర్తి చేయటంతో విపక్షాల పెదవులు నవ్వులతో విరబూస్తే.. అధికార పక్ష సభ్యులకు రాజేందర్ రెడ్డి వ్యవహారశైలి ఇబ్బందికరంగా ఫీలయ్యారు. ఎవరు ఏ పని చేయాలో అది చేస్తే బాగుంటుంది. అంతకు మించితేనే.. అసలు చిక్కంతా?

స్పీకర్ సైతం సున్నితంగా చురకలంటించేలా ఉండటం గమనార్హం. అధికారపార్టీకి చెందిన రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసంగం అధికారపక్ష సభ్యుల్నే కాదు.. విపక్ష సభ్యుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. ఇదంతా కంటెంట్ పుణ్యంతో కాదు.. అత్యుత్సాహంతోనని చెప్పాలి. కొసమెరుపేమంటే.. రాజేందర్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ని అభినందించటం కనిపించింది.