Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వం క్షమించరాని తప్పు చేసిందంటున్న వాటర్ మాన్!

By:  Tupaki Desk   |   12 Dec 2022 3:33 PM GMT
జగన్ ప్రభుత్వం క్షమించరాని తప్పు చేసిందంటున్న వాటర్ మాన్!
X
ఏపీలో జగన్ సర్కార్ మీద ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పర్యావరణ వేత్తలు, ఉద్యమకారులు రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెట్టినా మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, దేశం కోసం పాటు పడే వారు చేసే విమర్శలను మాత్రం ఎవరైనా పట్టించుకోవాల్సిందే.
.
ఏపీలో జగన్ సర్కార్ పాలన బాగాలేదు అని వారు పెదవి విరుస్తున్నారు. నొసలు చిట్లిస్తున్నారు. వివిధ సందర్భాలలో వారు ఏపీని సందర్శించినపుడు అక్కడ జరుగుతున్న పనుల తీరుని చూసి ఈ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విశాఖ వచ్చిన వాటర్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన రాజేంద్ర సింగ్ జగన్ సర్కార్ క్షమించరాని తప్పు చేసింది అంటూ కలత చెందుతూ ఘాటైన పదాలను ఉపయోగించారు.

ఆయన విశాఖ రుషికొండను దానికి ఎదురుగా కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం పై నుంచి చూసి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండను సర్వనాశనం చేశారు అని ఆయన తెగ బాధపడ్డారు. రుషికొండ మీద అభివృద్ధి పేరిట చేస్తున్న నష్టం అంతా ఇతా కాదు అని ఆయన మండిపడ్డారు. పర్వతాలు అన్నవి చాలా కీలకమైనవి అని ఆయన అభివర్ణించారు. సముద్రం తల్లిగా ఉంటే పర్వతాలు ఆ తల్లి వక్ష స్థలాలని ఆయన అభివర్ణించారు.

అలాంటి పర్వతాలను నేలమట్టం చేయాలనుకోవడం దారుణం అని ఆయన అన్నారు. రుషికొండ చాలా అరుదైన కొండగా చరిత్రలో నిలిచి ఉందని అన్నారు. అలాంటి దానిని నాశనం చేయాలని చూడడం కంటే తప్పు మరోటి ఉండదని ఆయన ఆక్షేపించారు. అక్కడ నిర్దాక్షిణ్యంగా తవ్వకాలు జరిగాయని, వాటిని చూస్తూంటే తనకు ఏడుపు వస్తోందని రాజేంద్ర సింగ్ అన్నారు. ఈ ప్రభుత్వం చేసినది శిక్షార్హమైన నేరమని ఆయన అన్నారు.

ఇక పర్యావరణానికి ప్రకృతికి కూడా ఆస్తిగా ఉన్న రుషికొండను కాపాడుకోవడంలో విఫలం అయ్యామని ఆయన ఆవేదన చెందారు. రామన్ మెగసేసే అవార్డ్ గ్రహీత అయిన రాజేంద్ర సింగ్ రాష్త్రీయ జల్ బిరాదారీ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన తాను తాజాగా రాసిన వరద కరవు నివారణ గురించిన పుస్తకాలను విశాఖలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామి పాదాల చెంత ఉంచి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన రుషికొండను చూడడం తటస్థించింది. అంతే ఆయన తన ఆవేదనను ఆపులేక ప్రభుత్వ తీరుని కడిగిపారేశారు. ఈ మధ్య ప్రభుత్వం మీద విమర్శలు సొంత రాష్ట్రం వారు మాత్రమే చేయడంలేదు బయట వారూ చేస్తున్నారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థ మీద బయట వారు మాట్లాడుతున్నారు, ఇపుడు వాటర్ మాన్ కూడా ఏపీ సర్కార్ తప్పిదాలు దారుణమంటూ మండిపడ్డారు. మరి దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా బదులిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.