Begin typing your search above and press return to search.

రజనీవల్ల కాకపోతే మోడీ వస్తారట!

By:  Tupaki Desk   |   15 Sep 2016 4:56 AM GMT
రజనీవల్ల కాకపోతే మోడీ వస్తారట!
X
తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల వేడి ఇప్పుడిప్పుడే చల్ల బడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చల్లబడటం అనేది తాత్కాలిక ఉపసమనమే కానీ.. శాస్వత పరిష్కారం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రావాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్‌ తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన తారలు చేపట్టిన ధర్నా కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని చెప్పిన ఈమె ఇరు రాష్ట్రాలకు రజనీకాంత్ కావాల్సిన వారని, నష్టపోయిన తమిళనాడుకు మద్దతుగా ఆయన గళం విప్పాలని కోరారు.

కర్ణాటకలో తమిళులపై జరిగిన దాడిని నిరసిస్తూ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో బీజేపీ ఆందోళన చేపట్టిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. లక్షలాదిమంది తమిళులు కన్నడిగుల వేధింపులను తట్టుకోలేక సొంత ఊళ్లకు తిరుగుముఖం పడుతున్నారన్నారు.. కర్ణాటకలో తమిళులను వెతికి వెతికి ఐడీ కార్డులు చూసి నిర్ధారించుకుని మరీ కన్నడిగులు దాడులు జరుపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన ఈమిళి సై.. తమిళనాడులో కన్నడ ప్రజలకు, సంస్థలకు తమ ప్రభుత్వం భద్రత కల్పిస్తే.. ఇందుకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు.

కాగా.. రజనీకాంత్ మధ్యవర్తిత్వం చేసినప్పటికీ సమస్య కొలిక్కిరాని పక్షంలో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకుంటారని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.