Begin typing your search above and press return to search.

తలైవా పొలిటికల్ ఎంట్రీ...అవసరమా?

By:  Tupaki Desk   |   4 Dec 2020 4:30 PM GMT
తలైవా పొలిటికల్ ఎంట్రీ...అవసరమా?
X
త‌మిళ‌నాట విశ్వ‌న‌టుడు క‌మ‌ల్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీల పొలిటిక‌ల్ ఎంట్రీ పై చాలాకాలంగా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త రెండేళ్లుగా సినీ ఫ‌క్కీలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మ‌ల్ `మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్` పార్టీ పెట్టారు. అయితే, రజనీకాంత్ మాత్రం పార్టీ పెడతారా లేదా అన్న సస్పెన్స్ ను కొనసాగిస్తూ వచ్చారు. దీంతో,రజనీ అసలు రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే, 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు, సస్పెన్స్ , డ్రామాకు తెర దించుతూ రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ పెట్టబోతున్నానని, తమిళ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చే సమయం వచ్చిందని తలైవా తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. అయితే, రాజకీయ అరంగేట్రంపై తలైవా స్వయంగా చేసిన ప్రకటనపై తమిళనాట తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. లేటు వయసులో లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తానంటోన్న రజనీకాంత్ నిర్ణయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబీలు.

ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ లేదని, బీజేపీకి సాయపడేలా ఓట్లను చీల్చడం మినహా చేసేదేమీ ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ తరహాలోనే తమిళనాడులో రజనీ కూడా విమర్శలు ఎదుర్కొనేందుకే పార్టీ పెడుతున్నారని కొందరు అంటున్నారు. తన దాన ధర్మాలతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో, సాదాసీదా జీవితంతో రజనీకాంత్ ప్రజల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని, అయితే, రాజకీయాల విషయంలో ప్రజల ఆలోచన వేరుగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పదేళ్ల క్రితం రజనీకాంత్ పార్టీ పెట్టి ఉంటే తాను సంతోషించేవాడినని, ఇపుడు తలైవా వయసు, ఆరోగ్యం రీత్యా ఆయన రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయం కాదని రజనీకాంత్ అభిమానులు కొందరు అనుకుంటున్నారు. రాజకీయాలు, సినిమా వేరని, అయితే, ఎంజీఆర్, జయలలితల రాజకీయ అరంగేట్రం నాటి పరిస్థితులు వేరు కాబట్టే వారు రాణించారని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో రజనీ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు.